వాళ్లను భారత్‌ బెదిరించింది; పాక్‌ మంత్రి అక్కసు

10 Sep, 2019 16:36 IST|Sakshi

ఇస్లామాబాద్‌ : భారత క్రీడా అధికారులు అట్టడుగు స్థాయి వ్యక్తుల్లా ప్రవర్తిస్తున్నారంటూ పాకిస్తాన్‌ మంత్రి ఫవాద్‌ చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పాక్‌కు వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన చవకబారు చర్యలను ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భద్రతా కారణాల దృష్ట్యా శ్రీలంక క్రికెటర్లు పాకిస్తాన్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. క్రికెటర్లతో చర్చించిన అనంతరం ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఆటగాళ్లు పాక్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నట్లు శ్రీలంక బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ విషయంపై స్పందించిన పాక్‌ మంత్రి ఫవాద్‌ మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. ఈ మేరకు...‘ పాక్‌లో పర్యటిస్తే ఐపీఎల్‌ ఆడకుండా అడ్డుకుంటామని భారత్‌ శ్రీలంక ఆటగాళ్లను బెదిరించిందని కొంతమంది స్పోర్ట్స్‌ కామెంటేటర్లు నాకు చెప్పారు. ఇది నిజంగా చవకబారు చర్య. భారత క్రీడా అధికారుల మితిమీరిన దేశభక్తికి నిదర్శనమైన ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇది దిగజారుడు, చవకబారు పని’ అని ఫవాద్‌ ట్వీట్‌ చేశారు.

కాగా గతంలో 2009లో పాక్‌లో పర్యటించిన శ్రీలంక క్రికెటర్లు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. వారు ప్రయాణిస్తున్న బస్సుపై లాహోర్‌లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ క్రమంలో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పర్యటనను రద్దు చేసుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇక భారత్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌-2 ప్రయోగం చివరి నిమిషంలో విఫలం కావడంపై కూడా ఫవాద్‌ ఇదే విధంగా స్పందించారు. రాని పనిలో వేలెందుకు పెట్టాలంటూ భారత శాస్త్రవేత్తలను అవమానించి నెటిజన్ల చేతిలో చివాట్లు తిన్నారు. కాగా ఆర్టికల్‌ 370 రద్దు, జమ్మూ కశ్మీర్‌ విభజన అనంతరం దాయాది దేశం భారత్‌పై విద్వేషపూరిత చర్యలకు తెగబడుగున్న సంగతి తెలిసిందే. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సహా ఇతర మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలతో విషం చిమ్ముతూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు