చహర్‌ బ్రదర్స్‌ అదరగొట్టారు: విరాట్‌ కోహ్లి

7 Aug, 2019 16:40 IST|Sakshi

పంత్‌ నుంచి ఇంకా ఆశిస్తున్నాం

యువకులు రాణిస్తుండటం టీమిండియాకు ఎంతో అనుకూలం: కోహ్లి

ప్రొవిడెన్స్‌ (గయానా) : నాలుగు పరుగులు మూడు వికెట్లు. టి20లో సాధ్యంకాని బౌలింగ్‌ గణాంకాలు. అది కూడా పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పైన. కెరీర్‌లో గుర్తిండిపోయే ప్రదర్శన చేశాడు యువ బౌలర్‌ దీపక్‌ చహర్‌. అరంగేట్రపు మ్యాచ్‌లో దారాళంగా పరుగులిచ్చాడు. దీంతో అతడిపై ఆశలు సన్నగిల్లాయి. కానీ విండీస్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో బుల్లెట్‌లా దూసుకొస్తున్న దీపక్‌ చహర్‌ బంతులను ఆడటానికి కరేబియన్‌ బ్యాట్స్‌మెన్‌ వెన్నులో వణుకు పుట్టింది. దీపక్‌ చహర్‌తో పాటు ఐపీఎల్‌, లిస్టు ఏ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన స్పిన్నర్‌ రాహుల్‌ చహర్‌ విండీస్‌తో జరిగిన చివరి టి 20లో అదరగొట్టారు. వీరి ఆటకు మంత్రముగ్దుడైన సారథి విరాట్‌ కోహ్లి ప్రశంసల జల్లు కురిపించాడు.

వెస్టిండీస్‌తో టి20 సిరీస్‌లో ఆల్‌రౌండ్‌  ప్రదర్శన కనబర్చిన టీమిండియా 3–0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. తొలి రెండు టి20లను గెలిచి సిరీస్‌ సొంతం చేసుకున్న తర్వాత కూడా టీమిండియా ఎక్కడా తగ్గలేదు. చివరి మ్యాచ్‌లోనూ కోహ్లి సేన తమ స్థాయికి తగ్గ ఆటతో ప్రత్యర్థిని చిత్తుచేసింది. మ్యాచ్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోహ్లి చహర్‌ బ్రదర్స్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. 

భువీ స్కిల్‌ఫుల్‌ బౌలర్‌
‘పిచ్‌ అంత గొప్పగా ఏంలేదు. బౌలింగ్‌కు అంతగా సహకరించటం లేదు.  అయినా రాహుల్‌ చహర్‌ తన తొలి స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. విండీస్‌ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. అనంతరం దీపక్‌ చహర్‌ బౌలింగ్‌ అత్యద్భుతం. తన స్వింగ్‌ బౌలింగ్‌తో విండీస్‌ బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించాడు. పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు పడగొట్టాడు. అయితే ఓ దశలో విండీస్‌ భారీ స్కోర్‌ సాధిస్తుందనుకున్నాం. కానీ చివర్లో దీపక్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌ సంచలన రీతిలో బౌలింగ్‌ చేయడంతో విండీస్‌ను కట్టడి చేయగలం. నిజంగా చహర్‌ బ్రదర్స్‌ ప్రదర్శన నన్ను ఎంతగానో ఆకట్టుకుంది.  భువీ స్కిల్‌ ఫుల్‌ బౌలర్‌. అతని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  

ప్రపంచకప్‌ 2023 గురించి ఇప్పుడే ఆలోచిండంలేదు
తొలి రెండు టి20లో పంత్‌ విఫలమవ్వడం నన్ను ఎంతగానో నిరాశపరిచింది. అయితే చివరి మ్యాచ్‌లో పంత్‌ అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ పంత్‌ నుంచి ఇంకా ఆశిస్తున్నాం. అయితే అతడిపై ఎలాంటి ఒత్తిడి తీసుకరావడం లేదు. పంత్‌కు పూర్తి స్వేచ్చనిచ్చాం. ఇక నా బ్యాటింగ్‌ పట్ల సంతృప్తిగా ఉన్నా. పరుగులు ఎన్ని సాధించాం అనే దానికంటే జట్టుకు మనం చేసిన పరుగులు ఎంతవరకు ఉపయోపడ్డాయి అనేది ముఖ్యం. ప్రపంచకప్‌ 2023 గురించి ఇప్పుడే ఆలోచించడం లేదు. యువ ఆటగాళ్లకు అనేక అవకాశాలు ఇచ్చి టీమిండియాకు మరింత బలం చేకూర్చాలని భావిస్తున్నాం’అంటూ కోహ్లి వివరించాడు. 
 

మరిన్ని వార్తలు