సరితాపై కఠిన చర్యలు!

13 Nov, 2014 00:32 IST|Sakshi
సరితాపై కఠిన చర్యలు!

దీర్ఘకాల నిషేధం విధించే యోచనలో ఏఐబీఏ నేడు క్రమశిక్షణ కమిటీ నివేదిక
 
 న్యూఢిల్లీ/కౌలాలంపూర్: ఇంచియాన్ ఏషియాడ్‌లో పతకం స్వీకరించేందుకు నిరాకరించిన భారత బాక్సర్ లైష్రామ్ సరితా దేవిపై కఠిన చర్యలు తీసుకునేందుకు అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సిద్ధమవుతోంది. ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పినా... ఆమెపై దీర్ఘకాల నిషేధం విధించాలని యోచిస్తోంది. నేటి (గురువారం) క్రమశిక్షణ కమిటీ సమావేశం తర్వాత బాక్సర్‌పై తుది చర్యలు తీసుకుంటామని ఏఐబీఏ అధ్యక్షుడు చింగ్ కౌ వు తెలిపారు.

స్విట్జర్లాండ్, అమెరికా, స్పెయిన్, ఇంగ్లండ్‌ల నుంచి ఒక్కొక్కరు క్రమశిక్షణ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ‘సరితా కెరీర్ దాదాపుగా ముగిసినట్లే. ఆమెకు భారీ శిక్ష విధించనున్నాం. అంతర్జాతీయ పోటీల్లో అలాంటి సంఘటనలను మేం సహించం. గెలుపును అంగీకరించినప్పుడు ఓటమిని కూడా ఆమోదించాలి. ప్రతి ఒక్కరు సరితలాగా ప్రవర్తిస్తే ఈ పోటీలు ఎందుకు?’ అని వు ప్రశ్నించారు.  

 నిషేధం ఎత్తివేస్తారు
 మరోవైపు తనపై ఉన్న తాత్కాలిక నిషేధాన్ని ఎత్తివేస్తారని సరితా ఆశాభావం వ్యక్తం చేసింది. రింగ్‌లోకి మళ్లీ దిగేందుకు అనుమతి లభిస్తుందని చెప్పింది. ‘ఇప్పటికే బేషరతుగా క్షమాపణలు చెప్పా. ఏఐబీఏ అధ్యక్షుడు ఏం మాట్లాడాడో తెలుసుకుంటా. ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తా. నాపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తారని నమ్ముతున్నా.

ఈ కేసులో నాకు న్యాయం జరిగేలా చూడాలని కోరుకుంటున్నా’ అని సరితా వ్యాఖ్యానించింది. బాక్సర్ క్షమాపణలు చెప్పింది కాబట్టి శిక్ష తక్కువగా ఉంటుందని బాక్సింగ్ ఇండియా అధ్యక్షుడు సందీప్ జజోడియా అన్నారు. ముందస్తు ప్రణాళికతో కాకుండా భావోద్వేగంలో ఆ సంఘటన జరిగిందన్నారు.

మరిన్ని వార్తలు