‘నన్ను మానసికంగా వేధించారు’

10 Oct, 2018 09:04 IST|Sakshi
బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల

సాక్షి, హైదరాబాద్‌ :#మీటూ’ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం ఫిల్మ్‌ ఇండస్ట్రీకి చెందిన వారు మాత్రమే కాకుండా మీడియా వంటి ఇతర రంగాలకు చెందిన మహిళలు కూడా తమకు ఎదురైన చేదు అనుభవాలను.. అందుకు కారణమైన వ్యక్తుల పేర్లను ధైర్యంగా వెల్లడిస్తున్నారు. ఇప్పుడు వీరి కోవలోకి బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాల చేరారు. తాను కూడా వేధింపులకు గురయ్యానని.. కాకపోతే అవి మానసిక వేధింపులు అంటూ జ్వాల వరుస ట్వీట్‌లు చేశారు.

‘#మీటూ ద్వారా నేను నాకు ఎదురైన మానసిక వేధింపులు గురించి వెల్లడించాలనుకుంటున్నాను. అతను 2006లో చీఫ్‌ అయ్యాడు. అప్పటి నుంచి నన్ను మానసిక వేధింపులకు గురి చేశాడు. నేషనల్‌ చాంపియన్‌ అయిన నన్ను జట్టు నుంచి బయటకు పంపించాడు. నేను బ్యాడ్మింటన్‌కు రాజీనామా చేయడానికి ఇది కూడా ఓ కారణం. నన్ను బయటకు పంపించడమే కాకుండా నాతో పాటు ఆడే నా పార్ట్‌నర్స్‌ని కూడా బెదిరించాడు. నేను రియో ఒలంపిక్స్‌ నుంచి వచ్చిన తరువాత కూడా ఈ వేధింపులు కొనసాగాయి. నేను ఎవరితో అయితే కలిసి మిక్స్‌డ్ ఆడతానో తనను కూడా బెదిరించారు. దాంతో నేను జట్టు నుంచి బయటకు వచ్చేశాను’ అంటూ జ్వాల ట్వీట్‌ చేశారు.

బ్యాడ్మింటన్‌లో పీవీ సింధు, సైనా నెహ్వాల్ వంటి సింగిల్స్ క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ... డబుల్స్‌లో సంచలన విజయాలు సాధించిన వారిని మాత్రం సరిగ్గా పట్టించుకోవడం లేదనే కారణంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాదీ క్రీడాకారిణి అయిన ఈ ‘ఫైర్‌ బ్రాండ్‌’ తన డబుల్స్ కెరీర్లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు.

>
మరిన్ని వార్తలు