గాయంతోనే ఆడాను!

17 Apr, 2020 00:18 IST|Sakshi
మొహమ్మద్‌ షమీ

2015 ప్రపంచకప్‌ సెమీస్‌పై షమీ

న్యూఢిల్లీ: ధోని నాయకత్వంలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగి 2015 వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ చేరగలిగింది. సెమీస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా చేతిలో 95 పరుగులతో ఓడి నిష్క్రమించింది. ఈ కీలక మ్యాచ్‌లో ప్రధాన పేసర్‌ మొహమ్మద్‌ షమీ తప్పనిసరి పరిస్థితుల్లో బరిలోకి దిగాల్సి వచ్చింది. ఈ టోర్నీ ఆరంభంనుంచే మోకాలి గాయంతో బాధపడుతూ మ్యాచ్‌లు ఆడుతూ వచ్చిన షమీ సెమీస్‌లో ఆడటం తన వల్ల కాదన్నా... ధోని భరోసా ఇవ్వడంతో ఆడాల్సి వచ్చింది.

మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌తో జరిగిన ఇన్‌స్టగ్రామ్‌ సంభాషణలో అతను ఈ విషయం చెప్పాడు. ‘సెమీస్‌కు ముందు ఇక నా వల్ల కాదంటూ జట్టు సహచరులతో చెప్పేశాను. నొప్పి చాలా ఉందని చెప్పాను కానీ టీమ్‌ మేనేజ్‌మెంట్‌ గాయం తగ్గుతుందని నమ్మింది. మహి భాయ్‌ నాలో ఆత్మవిశ్వాసం నింపాడు. ఇది సెమీస్‌ కాబట్టి మరో బౌలర్‌ను ఆడించలేమని చెప్పారు. తొలి ఐదు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చాను. ఫించ్, వార్నర్‌లను ఇబ్బంది పెట్టగలిగినా వికెట్‌ మాత్రం దక్కలేదు. ఇంజక్షన్‌ తీసుకున్నా పరిస్థితి మెరుగు కాలేదు.

ఇక బౌలింగ్‌ చేయలేనని ధోనికి చెప్పేశాను. అయితే అతను మాత్రం నీపై నమ్మకముంది. పార్ట్‌టైమర్‌ అయినా ఎలాగూ పరుగులిస్తాడని అన్నాడు. అలాంటి స్థితిలో నేను ఎప్పుడూ ఆడలేదు. ఆ మ్యాచ్‌ తర్వాత నా కెరీర్‌ ముగిసిపోతుందని చాలా మంది చెప్పారు. కానీ అదృష్టవశాత్తూ అలా జరగలేదు’ అని షమీ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 60కు మించకుండా పరుగులు ఇస్తే చాలని షమీకి ధోని లక్ష్యం విధించగా...షమీ 68 పరుగులు ఇచ్చాడు. మిగిలిన ఇద్దరు పేసర్లు మోహిత్‌ (75), ఉమేశ్‌ (72)లతో పోలిస్తే మెరుగ్గానే బౌలింగ్‌ చేశాడు. అయితే ఈ గాయం షమీ కెరీర్‌కు నిజంగానే బ్రేకులు వేసింది. మోకాలి గాయానికి శస్త్ర చికిత్స కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు ఆటకు దూరం కావాల్సి వచ్చింది.  

>
మరిన్ని వార్తలు