MS Dhoni: ధోని అభిమానులకు శుభవార్త! కీలక అప్‌డేట్.. ఇంకో పది రోజుల్లో..

24 Dec, 2023 09:33 IST|Sakshi
మహేంద్ర సింగ్‌ ధోని (PC: IPL/CSK X)

CSK CEO Kasi Viswanathan On MS Dhoni IPL future: మిస్టర్‌ కూల్‌ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మరో ఐపీఎల్‌ సీజన్‌ ఆడతాడా? గతేడాది నుంచి తలైవా అభిమానులను వేధిస్తున్న మిలియన్‌ డాలర్‌ ప్రశ్న. 41 ఏళ్ల వయసులో చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఐదోసారి ట్రోఫీ అందించాడు ధోని.

నిజానికి.. ఐపీఎల్‌-2022లోనే తన వారసుడిగా టీమిండియా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాను ప్రకటించి.. పగ్గాలు అప్పగిస్తే ఫలితం శూన్యం కావడంతో మళ్లీ తనే సారథిగా బాధ్యతలు చేపట్టాడీ ఈ ‘జార్ఖండ్‌ డైనమైట్‌’. తనదైన మార్కుతో ఈ ఏడాది మరోసారి సీఎస్‌కేను చాంపియన్‌గా నిలిపాడు.

వేధిస్తున్న మోకాలి నొప్పి
మరి ఐపీఎల్‌-2024లోనూ ధోని ఇదే దూకుడును కొనసాగించగలడా? మోకాలి నొప్పి నుంచి కోలుకుని జట్టును మరోసారి ముందుండి నడిపిస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ సీఈఓ కాశీ విశ్వనాథ్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు.

చెన్నైలో జరిగిన జూనియర్‌ సూపర్‌ కింగ్స్‌ ఈవెంట్‌ లాంచ్‌ సందర్భంగా ధోని ఐపీఎల్‌ భవితవ్యంపై ప్రశ్న ఎదురుకాగా.. ‘‘నాకు ఆ విషయం గురించి తెలియదు. కెప్టెన్‌గా ఆయన తనంతట తానే ఈ విషయాన్ని నేరుగా అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నాడు.

పది రోజుల్లో నెట్స్‌లో ప్రాక్టీస్‌
తను ఆడతాడా లేదా అన్న విషయం గురించి ఇంతవరకు ఏమీ చెప్పలేదు. తను ఏం అనుకుంటే అదే చేస్తాడు. ప్రస్తుతం ధోని ఫిట్‌గానే ఉన్నాడు. రిహాబిలిటేషన్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నాడు.

ఇంకో పది రోజుల్లో ధోని నెట్స్‌లో ప్రాక్టీస్‌ మొదలుపెట్టే అవకాశం కూడా ఉంది’’ అని కాశీ విశ్వనాథ్‌.. తలైవా అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాగా ఐపీఎల్‌-2024 వేలం సందర్భంగా సీఎస్‌కే కొత్తగా ఆరుగురు ఆటగాళ్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2024 వేలంలో సీఎస్‌కే కొన్న ఆటగాళ్లు వీరే
1. రచిన్ రవీంద్ర (రూ.1.8 కోట్లు)
2. శార్దూల్ ఠాకూర్ (రూ.4 కోట్లు)
3. డారిల్‌ మిచెల్ (రూ.14 కోట్లు)
4. సమీర్ రిజ్వీ (రూ.8.4 కోట్లు)
5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ.2 కోట్లు)
6. అవనీష్ రావు అరవెల్లి (రూ.20 లక్షలు).

రిటైన్‌ చేసుకున్న ఆటగాళ్ల జాబితా:
మహేంద్ర సింగ్ ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, డెవాన్ కాన్వే, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, డ్వేన్ ప్రిటోరియస్, మహీష్ తీక్షణ, ప్రశాంత్ సోలంకి, దీపక్ చహర్, ముఖేష్ చౌదరి, సిమర్జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రాజ్‌వర్ధన్‌ హంగర్గేకర్, మిచెల్ శాంట్నర్, మతీషా పతిరణా, సుబ్రాన్షు సేనాపతి.

రిలీజ్‌ చేసిన ప్లేయర్లు
డ్వేన్ బ్రావో, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, ఎన్. జగదీశన్, సి.హరి నిశాంత్, కె.భగత్ వర్మ, కె.ఎం.ఆసిఫ్, అంబటి రాయుడు(రిటైర్డ్‌), రాబిన్ ఊతప్ప (రిటైర్డ్).
చదవండి: IPL 2024: ముస్తాబాద్‌ నుంచి ఐపీఎల్‌ దాకా.. సీఎస్‌కేకు ఆడే ఛాన్స్‌! 


 

>
మరిన్ని వార్తలు