నేను వెళ్లనంటే వెళ్లను: ముష్ఫికర్‌

28 Feb, 2020 11:02 IST|Sakshi

ఢాకా: పాకిస్తాన్‌లో పర్యటనకు సంబంధించి మరోసారి తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలంటూ బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు(బీసీబీ) చేసిన విజ్ఞప్తి చేసిన ముష్ఫికర్‌ రహీమ్‌ తోసిపుచ్చాడు. ఎట్టిపరిస్థితుల్లోనూ పాకిస్తాన్‌ పర్యటనకు తాను వెళ్లేది లేదంటూ తేల్చిచెప్పాడు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా తాను పాకిస్తాన్‌లో పర్యటించే బంగ్లాదేశ్‌ జట్టులో సభ్యుడిని కాబోనంటూ స్పష్టం చేశాడు. పాకిస్తాన్‌ పర్యటనపై ముష్ఫికర్‌ను బీసీబీ సంప్రదించింది. పాకిస్తాన్‌ పర్యటనకు వెళ్లననే గత నిర్ణయాన్ని ఒకవేళ మార్చుకుంటే మార్చుకోవచ్చని తెలిపింది. దీనిని ముష్ఫికర్‌ వినమ్రంగా తిరస్కరించాడు.

‘ఒకసారి నిర్ణయం తీసుకున్నాక అందులో వెనుకడగు వేసే ప్రసక్తే లేదు. నేను పాక్‌ పర్యటనకు వెళ్లనని ఇప్పటికే చెప్పా. దాన్ని బీసీబీ పెద్దలు కూడా అంగీకరించారు. ఇప్పుడే కాదు.. భవిష్యత్తులో కూడా పాక్‌కు వెళ్లను. నాకు ఇదివరకే పీఎస్‌ఎల్‌ ఆఫర్‌ వచ్చింది. నా పేరు పీఎస్‌ఎల్‌లో ఉందా..లేదా అనేది సమస్య కాదు. పాకిస్తాన్‌తో టోర్నమెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా ఉండను. దీన్ని బోర్డు తప్పకుండా గౌరవించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌కు వెళ్లడం మంచిది కాదనేది నా అభిప్రాయం. ఇక్కడ నా అభిప్రాయం చాలా క్లియర్‌గా ఉంది. భవిష్యత్తులో కూడా నా నిర్ణయం మారదు. అక్కడకి వెళ్లే బంగ్లా క్రికెటర్లకు నా విషెస్‌ తెలియజేస్తున్నా’ అని ముష్ఫికర్‌ పేర్కొన్నాడు. (ఇక్కడ చదవండి: ముష్ఫికర్‌ ‘డబుల్‌’ చరిత్ర)

పాకిస్తాన్‌లో క్రికెట్‌ ఆడటం ఏమీ ప్రమాదం కాదని చెప్పడం కోసమే ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లకు ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగా ఇరు దేశాల ద్వైపాక్షికి సిరీస్‌లో భాగంగా జనవరి 24వ తేదీ నుంచి ఏప్రిల్‌ ఐదో తేదీ వరకూ ఇరు జట్లు సిరీస్‌లు ఆడుతున్నాయి. ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌తో పాటు, ఒక టెస్టు మ్యాచ్‌ జరిగింది. ఇక ఏకైక వన్డేతో పాటు మరో టెస్టు మ్యాచ్‌ మిగిలి ఉంది. ఈ ఫైనల్‌ ఫేజ్‌ సిరీస్‌లో ఏప్రిల్‌3వ తేదీన వన్డే మ్యాచ్‌ జరుగనుండగా, రెండో టెస్టు మ్యాచ్‌ ఏప్రిల్‌5వ తేదీ నుంచి కరాచీలో ఆరంభం కానుంది. దీనిపై ముష్పికర్‌ను బీసీబీ సంప్రదించినా ఉపయోగం లేకుండా పోయింది.

>
మరిన్ని వార్తలు