పంచ్‌ పడితే..పతకాలు దాసోహం..!

24 Dec, 2019 11:05 IST|Sakshi

సాక్షి, పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ) : బాక్సింగ్‌లో తన పంచ్‌లకు పతకాలు దాసోహం అనాల్సిందే.. నిరంతర కఠోర శ్రమతో ఫిట్‌నెస్‌ సాధిస్తూనే బాక్సింగ్‌లో పతకాలు ఒడిసి పడుతూ.. అర్జున అవార్డును అందుకున్నాడు. తాజాగా ఢిల్లీ, బ్యాంకాంక్‌లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లోనూ సత్తా చాటి బంగారు పతకాలను కైవసం చేసుకున్నాడు. 2020లో నిర్వహించే వరల్డ్‌ గేమ్స్‌లో పాల్గొనేందుకు అర్హత సాధించాడు. దీంతో ఒలింపిక్స్‌లో దేశం తరపున పాల్గొని స్వర్ణం గెలుపొందడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. అతనే నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల నరేష్‌.

తనదైన శైలితో ముందుకు..
నరేష్‌ నిరంతర కఠోర శ్రమతో కూడుకున్న బాక్సింగ్‌లో తనదైన శైలితో ముందుకు సాగుతూ ఒలింపిక్స్‌లో స్వర్ణమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నార్ల యాదయ్య–పుల్ల మ్మ దంపతుల కుమారుడు నరేష్‌. యాదయ్య దినసరి మేస్త్రిగా పని చేస్తాడు. పీఏపల్లిలోని శ్రీ సాయికృష్ణవేణి పాఠశాలలో 7వ తరగతి వరకు చదివిన నరేశ్‌కు కరాటే మాస్టర్‌ సురేష్‌ బాక్సింగ్‌లో మెళకువలు నేర్పించాడు. కుటుంబ పోషణ నిమిత్తం హైదరాబాద్‌కు ఆ కుటుంబం వలస వెళ్లింది. నరేశ్‌ ప్రస్తుతం అవెన్యూ గ్రామర్‌ స్కూల్‌లో పదో తరగతి చదువుతుండగా అతడికి బాక్సింగ్‌పై మక్కువను గమనించిన అవెన్యూ గ్రామర్‌ స్కూల్‌ పీఈటీ నరేష్‌ను ప్రోత్సహించాడు. ఈ క్రమంలో లాల్‌బహదూర్‌ స్టేడియంలోని బాక్సింగ్‌ కోచ్‌ సత్యనారాయణ అతనికి బాక్సింగ్‌లో ఉచితంగా శిక్షణ ఇచ్చాడు. ఈ ఏడాది నైజీరియా వేదికగా నిర్వహించిన అంతర్జాతీయ జూనియర్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాకిస్థాన్‌ను ఓడించి కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు.

సాధించిన విజయాలు..
⇔ తాజాగా ఢిల్లీలో జరిగిన జూనియర్‌ నేషనల్‌ లెవల్‌ ఆర్మీ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు.
⇔ నవంబర్‌ 14 నుంచి 19 వరకు బ్యాంకాక్‌లో నిర్వహించిన ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌ లీగ్‌లో ఆస్ట్రేలియా, కొరియా, పాకిస్థాన్‌లతో తలపడి బంగారు పతకం నెగ్గాడు. 
2019 జనవరి 3– 6 తేదీల్లో నైజీరియాలో నిర్వహించిన అంతర్జాతీయ జూనియర్‌ బాక్సింగ్‌లో తొలి మ్యాచ్‌లో బల్గేరియా ఆటగాడిని ఒడించి రెండో మ్యాచ్‌లో రష్యా ఆటగాడిని మట్టికరిపించి ఫైనల్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆటగాడిని నాకౌట్‌ చేసి బంగారు పతకాన్ని సాధించాడు.
2018 ఢిల్లీ, హర్యాణ, మహారాష్ట్రలో నిర్వహించిన జాతీయ జూనియర్‌ బాక్సింగ్‌లో బంగారు పతకాలు సాధించాడు.
2017లో ముంబాయి, పూణె, గోవాలో జరిగిన అండర్‌–17 బాక్సింగ్‌ క్రీడా పోటీల్లో పాల్గొని బంగారు పతకంతో పాటు బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు, ఐరిష్‌ బాక్సర్‌ అవార్డు అందుకున్నాడు.
2016లో పంజాబ్‌లో నిర్వహించిన అండర్‌–16 రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంతో పాటు ఉత్తమ క్రీడాకారుడిగా పురస్కారం అందుకున్నాడు.
2014, 2015లలో నిర్వహించిన సబ్‌ జూనియర్‌ విభాగంలో 8 బంగారు పతకాలు సాధించాడు.

ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించడమే లక్ష్యం 
బాక్సింగ్‌ అంటేనే కఠోర శ్రమతో కూడుకున్నది. ఎప్పుడు ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ శ్రమించాల్సి ఉంటుంది. దేశం తరపున ఇప్పటి వరకు జూనియర్‌ విభాగంలో ఆడాను. తాజాగా ఢిల్లీ, బ్యాంకాక్‌లో నిర్వహించిన బాక్సింగ్‌ పోటీలో బంగారు పతకం గెలుపొందడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. దేశం తరపున ఒలింపిక్స్‌లో ఆడి బంగారు పతకం నెగ్గాలనేది నా లక్ష్యం.  – నరేశ్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా