లంక సిరీస్‌కు ధోని వద్దు.!

8 Nov, 2017 17:05 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీ20ల నుంచి మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోని తప్పుకోవాలని సూచించిన మాజీ క్రికెటర్లు వీవీఎస్‌ లక్ష్మణ్‌, అజిత్‌ అగార్కర్‌ల సరసన మరో మాజీ క్రికెటర్‌ చేరాడు. త్వరలో దక్షిణాఫ్రికాలో భారత్‌ పర్యటనను దృష్టిలో ఉంచుకోని శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్‌కు ధోనిని ఎంపికచేయవద్దని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అభిప్రాయపడ్డారు.

టీ20ల్లో దక్షిణాఫ్రికాను ఎదుర్కోవాలంటే జట్టు కార్యచరణను శ్రీలంకతో జరిగే సిరీస్‌లోనే రూపోందించాలని ఓ స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు తెలిపాడు. శ్రీలంక సిరీస్‌కు ఎంపికచేసేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి జట్టును ఎంపికచేయాలన్నాడు. శ్రీలంకతో జరిగే టీ20లకు ధోని స్థానంలో యువ క్రికెటర్లను పరీక్షించాలని సెలక్టర్లకు సూచించాడు. గత కొద్ది రోజులుగా ధోని బ్యాటింగ్‌లో వేగం తగ్గిందని, వేగంగా ఆడే యువ క్రికెటర్లు ఎందరో ఉన్నారని వారికి అవకాశం ఇవ్వాలని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో ధోని నెమ్మదిగా ఆడటంతో అతనిపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే సునీల్‌ గవాస్కర్‌, కెప్టెన్‌ కోహ్లిలు ధోని వెనకేసుకు రాగా ఈ నేపథ్యంలో ఆకాశ్‌ చోప్రా వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

భారత్‌కు చేరిన లంక జట్టు
టీమిండియాతో మూడు వన్డేలు, మూడు టీ20, మూడు టెస్టులు ఆడేందుకు లంక జట్టు బుధవారం భారత్‌కు చేరుకుంది. ఇరు జట్ల మధ్య తొలి టెస్టు నవంబర్‌ 16న కొల్‌కతాలో ప్రారంభంకానుంది.

మరిన్ని వార్తలు