భారత్‌కు ఐదు స్వర్ణాలు

13 Oct, 2018 00:55 IST|Sakshi

పారా ఆసియా క్రీడలు  

జకార్తా: పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల ఏడోరోజు శుక్రవారం చెస్‌లో రెండు, అథ్లెటిక్స్‌లో రెండు, బ్యాడ్మింటన్‌లో ఓ స్వర్ణం లభించాయి. వీటితోపాటు ఏడు రజతాలు, ఐదు కాంస్యాలతో మొత్తం 17 పతకాలు భారత్‌ ఖాతాలో చేరాయి. మహిళల ర్యాపిడ్‌ చెస్‌ పి1 విభాగంలో కె. జెన్నిత 1–0తో మనురుంగ్‌ రోస్‌లిండా (ఇండోనేసియా)పై గెలిచి స్వర్ణం చేజిక్కించుకోగా... పురుషుల ర్యాపిడ్‌–6 బీ2/బీ3 విభాగంలో కిషన్‌ పసిడి గెలిచాడు. పురుషుల జావెలిన్‌ త్రో ఎఫ్‌55 విభాగంలో నీరజ్‌ యాదవ్‌ (29.24 మీటర్లు) స్వర్ణం నెగ్గగా... అమిత్‌ బల్యాన్‌ ((28.79 మీటర్లు) రజతం సొంతం చేసుకున్నాడు.

మెన్స్‌ క్లబ్‌ త్రో ఎఫ్‌51 విభాగంలో అమిత్‌ కుమార్‌ (29.47 మీటర్లు) పసిడి పతకం గెలుచుకోగా... ధరమ్‌వీర్‌ (24.81 మీటర్లు) రజతం సాధించాడు. బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌3 ఫైనల్లో పరుల్‌ పర్మార్‌ 21–9, 21–5తో వన్‌డీ కమ్‌టమ్‌ (థాయ్‌లాండ్‌)పై నెగ్గి బంగారు పతకం సాధించింది. పురుషుల 100 మీటర్ల స్విమ్మింగ్‌ ఎస్‌10 కేటగిరీలో స్వప్నిల్‌ పాటిల్‌ రజతం నెగ్గాడు. పురుషుల 4000 మీటర్ల సైక్లింగ్‌ సీ4 విభాగంలో గుర్లాల్‌ సింగ్‌ కాంస్యం సాధించాడు. రియో పారాలింపిక్స్‌ రజత పతక విజేత దీపా మలిక్‌ ఎఫ్‌ 51/52/53 డిస్కస్‌ త్రోలో కాంస్యం నెగ్గింది. మహిళల డిస్కస్‌ త్రో ఎఫ్‌11 కేటగిరీలో నిధి మిశ్రా (21.82 మీటర్లు) కాంస్యం సాధించింది.  

మరిన్ని వార్తలు