శ్రీశ్వాన్‌కు కాంస్యం

13 Oct, 2019 05:49 IST|Sakshi

ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌

ముంబై: సొంతగడ్డపై జరిగిన ప్రపంచ యూత్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మెరిశారు. శనివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, మూడు రజతాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఏడు పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెలంగాణ కుర్రాడు మరాలాక్షికరి శ్రీశ్వాన్‌ అండర్‌–14 ఓపెన్‌ విభాగంలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నిర్ణీత 11 రౌండ్ల తర్వాత నిజామాబాద్‌ జిల్లాకు చెందిన 13 ఏళ్ల శ్రీశ్వాన్‌ 8 పాయింట్లతో మరో ఐదుగురితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... శ్రీశ్వాన్‌కు మూడో స్థానం లభించింది.

భారత్‌కే చెందిన ఎల్‌.ఆర్‌.శ్రీహరి (తమిళనాడు) రెండో స్థానంలో నిలిచి రజతం గెల్చుకున్నాడు. ఈ విభాగంలో అజర్‌బైజాన్‌కు చెందిన ఐదిన్‌ సులేమాన్లి 9 పాయింట్లతో విజేతగా నిలిచి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ టోరీ్నలో శ్రీశ్వాన్‌ ఏడు గేముల్లో గెలుపొంది, రెండింటిని ‘డ్రా’ చేసుకున్నాడు. మరో రెండు గేముల్లో ఓడిపోయాడు. ఈ ఏడాది జూలైలో బార్సిలోనాలో జరిగిన టోరీ్నలో శ్రీశ్వాన్‌ మూడో అంతర్జాతీయ నార్మ్‌ (ఐఎం)ను సాధించి... తెలంగాణ తరఫున పిన్న వయస్సులో అంతర్జాతీయ మాస్టర్‌ (ఐఎం) హోదా పొందిన ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

అండర్‌–18 ఓపెన్‌ విభాగంలో 14 ఏళ్ల తమిళనాడు గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద   చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద ఏడు గేముల్లో    గెలిచి, నాలుగు గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని తొమ్మిది పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. అండర్‌–18 బాలికల  విభాగంలో వంతిక అగర్వాల్‌ భారత్‌కు రజతం అందించింది. అండర్‌–14 బాలికల విభాగంలో దివ్య దేశ్‌ముఖ్‌ రెండో స్థానంలో, రక్షిత మూడో స్థానంలో నిలిచి వరుసగా రజత, కాంస్య పతకాలు అందించారు.    అండర్‌–16 ఓపెన్‌ విభాగంలో అరోన్యాక్‌ ఘోష్‌ కాంస్యం గెలిచాడు.    

మరిన్ని వార్తలు