ఇష్టమొచ్చినట్లు రాయకండి: ప్రీతి జింటా

22 May, 2018 15:03 IST|Sakshi

పుణె: వివాదాస్పద వీడియో.. మీడియా కథనాలపై కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సహ యజమాని ప్రీతి జింటా మళ్లీ స్పందించారు. ముంబై ఓడిపోయినందుకు తానేం సంతోషపడలేదని, తమ జట్టు అవకాశం కోసమే అలా స్పందించానని మరోసారి స్పష్టం చేశారు. అనవసరంగా మీడియా ఆ విషయాన్ని ఎక్కువ చేసి చూపిస్తోందని ప్రీతి మండిపడ్డారు. లీగ్‌ మ్యాచ్‌ల్లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఓటమి చెంది ఇంటి ముఖం పట్టింది. దీంతో ప్రీతి ఆనందం వ్యక్తం చేసినట్లు ఓ వీడియో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. (వీడియో కోసం..)

తమ జట్టు(పంజాబ్‌) ప్లేఆఫ్‌ రేసులో నిలవాలంటే ముందుగా ముంబై ఓడిపోవాలని, అందుకే ఆ జట్టు ఓటమి తర్వాత తన సంతోషాన్ని పంచుకున్నట్లు ప్రీతి తెలిపారు. అంతేకానీ తనకు ముంబై ఇండియన్స్‌ పై వ్యక్తిగత ద్వేషం ఏమీ లేదని తెలిపారు. సంచలనాల కోసం మీడియా అత్యుత్సాహంతో వార్తలు రాస్తోందని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ‘మా జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయింది. అప్పుడు రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు సంతోషం వ్యక్తం చేసి ఉండొచ్చు. ఎవరి జట్ల కోసం వాళ్లు ఆలోచించటంలో తప్పులేదు. వేరే జట్టు ప్లేఆఫ్‌కు అర్హత సాధిస్తే నేను సంబరపడలేను కదా..! ముంబై ఓడి పోయినందుకు నేను ఆనంద పడలేదు.. మా జట్టు పరిస్థితిపై మాత్రమే ఆందోళన చెందాను పంజాబ్‌ నాకౌట్‌కి చేరుకోలేక పోవడం బాధాకరం’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

‘మా జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునేందుకు గొప్ప అవకాశం లభించింది. కానీ విజయమే వరించలేదు. ఫైనల్స్‌లో ఏ జట్టు గెలిచినా ఫర్వాలేదు. కానీ,  ఇష్టమొచ్చినట్లు వార్తలు రాయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నా’ని ఆమె పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు