మన మహిళలు మరెన్నో పతకాలు సాధిస్తారు

10 Mar, 2020 22:52 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు

న్యూఢిల్లీ: భవిష్యత్తులో భారత మహిళా క్రీడాకారిణులు దేశానికి మరెన్నో పతకాలు అందిస్తారని ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ పీవీ సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. 2019 సంవత్సరానికిగాను బీబీసీ ఇండియన్‌ స్పోర్ట్స్‌ వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌గా నిలిచిన ఆమె... అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని బీబీసీ ఏర్పాటు చేసిన అవార్డు కార్యక్రమంలో వీడియో ద్వారా యువ మహిళా క్రీడాకారిణులకు సందేశాన్నిచ్చింది. ‘యువ క్రీడాకారిణులకు నా సందేశం ఏమిటంటే... ఒక మహిళగా మనపై మనకు నమ్మకం ఉండాలి. పతకం సాధించగలమనే దృఢ సంకల్పం ఉండాలి. ఇవి ఉంటే పతకం సాధించడం పెద్ద కష్టం కాబోదు. నాకు నమ్మకం ఉంది... త్వరలోనే మహిళా క్రీడాకారిణులు భారత్‌కు అనేక పతకాలను సాధిస్తారు. ‘స్పోర్ట్స్‌ వుమన్‌ ఆఫ్‌ ద ఇయర్‌’అవార్డును నా మద్దతు దారులకు, అభిమానులకు అంకితం చేస్తున్నా. ఇటువంటి అవార్డులు భవిష్యత్తులో మరింత సాధించాలనే స్ఫూర్తిని మాలో రగిలిస్తాయి.’అని పేర్కొంది.

2012లో పదిహేడేళ్ల వయసులో తొలిసారి బ్యాడ్మింటన్‌ ప్రపంచ మహిళల ర్యాంకింగ్స్‌లో టాప్‌–20లో చోటుదక్కించుకున్న సింధు... అ తర్వాత వెనుదిరిగి చూడలేదు. ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌ మెడల్స్‌ను గెల్చుకున్న ఆమె... ఒలింపిక్స్‌లో సింగిల్స్‌ విభాగంలో రజత పతకం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌గా నిలిచింది. అంతేకాకుండా గత నాలుగు సంవత్సరాలుగా ర్యాంకింగ్స్‌లో టాప్‌–10లోనే కొనసాగుతోంది. బీబీసీ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును వెటరన్‌ అథ్లెట్‌ పి.టి ఉష సొంతం చేసుకుంది. 1984 లాస్‌ఏంజిల్స్‌ ఒలింపిక్‌ గేమ్స్‌లో ఉష మహిళల 400 మీటర్ల హార్డిల్స్‌ పరుగు పందెంలో 0.01 సెకను తేడాతో కాంస్య పతకాన్ని కోల్పోయింది. ఈ కార్యక్రమానికి కేంద్ర క్రీడల మంత్రి కిరణ్‌ రిజిజు గౌరవ అతిథిగా హాజరయ్యారు.  
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా