ఫైనల్లోకి తెలుగు తేజం సింధు

4 Aug, 2018 20:36 IST|Sakshi

నాంజింగ్‌ (చైనా) : ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగు తేజం పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్‌ చరిత్రలో వరుసగా ఐదోసారి బరిలోకి దిగి నాలుగోసారి పతకాన్ని ఖాయం చేసుకున్న సింధు స్వర్ణపోరుకు సిద్ధమైంది. శనివారం జరిగిన రెండో సెమీఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్, జపాన్‌కు చెందిన అకానె యామగుచిపై 21-16, 24-22తో వరుస గేముల్లో విజయం సాధించింది. స్వర్ణం కైవసం చేసుకునేందుకు సింధు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. పసిడి పోరులో స్పెయిన్‌కు చెందిన అగ్రశ్రేణి క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో సింధు తలపడనుంది. 

తొలిగేమ్‌లో ప్రత్యర్థిని ఇరుకున పెట్టిన సింధు రెండో గేమ్‌లో తన శక్తిని కూడగట్టుకుని సత్తా చాటింది. తొలిగేమ్‌లో తొలుత యామగుచి ఆధిక్యం ప్రదర్శించినా 12-12తో సింధు సమం చేసింది. ఆపై ఆరు పాయింట్లు సాధించి 18-12లో ఆధిక్యంలో కనిపించిన సింధు.. చివరికి 21-16తో గేమ్‌ నెగ్గింది. రెండో గేమ్‌ మాత్రం సుదీర్ఘ ర్యాలీలు, ప్లేస్‌మెంట్లతో రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది. ఓ దశలో యామగుచి 19-12కు ఆధిక్యంలో నిలిచి రెండో గేమ్‌ను నెగ్గేలా కనిపించింది. కానీ మళ్లీ పుంజుకున్న సింధు 19-19తో స్కోరు సమం చేసింది. ఆపై 20-20, 21-21 ఇలా సాగిన ఉత్కంఠభరిత గేమ్‌ను 24-22తో సింధు నెగ్గి.. మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. కీలకమైన క్వార్టర్స్‌, సెమీస్‌ మ్యాచ్‌ల్లో సింధు జపాన్‌ క్రీడాకారిణులను ఓడించటం గమనార్హం.

మరిన్ని వార్తలు