'ఈ సారి ఎలాగైనా సాధిస్తా'

17 Aug, 2019 06:56 IST|Sakshi

పీవీ సింధు

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ చాంపియన్‌షిప్‌ నేపథ్యంలో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఫిట్‌నెస్‌పై ఎక్కువ దృష్టిపెట్టినట్లు చెప్పింది. ఈ మెగా ఈవెంట్‌లో గతంలో సింధు నాలుగు పతకాలు సాధించింది. రెండేసి చొప్పున రజత, కాంస్య పతకాలు నెగ్గింది. కానీ స్వర్ణం మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఫైనల్‌ చేరిన రెండుసార్లు పరాజయమే చవిచూసింది. అయితే ఈ సారి మాత్రం టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నానని 24 ఏళ్ల సింధు చెప్పు కొచ్చింది. ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్‌ బ్యాడ్మింటన్‌ జరుగనుంది.

ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘ప్రాక్టీస్‌లో కఠోరంగా శ్రమించా. ఈ సారి తప్పకుండా స్వర్ణం సాధిస్తానన్న నమ్మకముంది. అలాగని నాపై ఒత్తిడేమీ లేదు. మంచి ప్రదర్శన కనబరుస్తాను. డిఫెన్స్, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టాను. అలాగే ఆటతీరు కూడా మెరుగయ్యేందుకు కష్టపడ్డాను’ అని తెలిపింది. తెలుగుతేజంకు జపాన్‌ ప్రత్యర్థి యామగుచి కొరకరాని కొయ్య గా మారింది. ఇండోనేసియా, జపాన్‌ టోర్నీల్లో సింధుకు చుక్కలు చూపించింది. ఆమెను ఎదుర్కోవడంపై ఎలాంటి కసరత్తు చేశారని ప్రశ్నిం చగా.... ‘యామగుచితో పోరు కష్టమేమీ కాదు. ఇండోనేసియా టోర్నీలో ఆమెను దీటుగా నే ఎదుర్కొన్నా.

కానీ ఆమె అటాకింగ్‌ బాగా చేసింది. ర్యాలీల్లోనూ దిట్టే! కాబట్టి ఆమె దూకుడు నన్నేమీ ఆశ్చర్యపరచలేదు. ఆమెతో నేను తలపడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని సింధు వివరించింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తెలుగుతేజం ఐదో సీడ్‌గా బరిలోకి దిగుతోంది. తొలిరౌండ్లో ఆమెకు బై లభించింది. రెండో రౌండ్లో చైనీస్‌తైపీకి చెందిన పాయ్‌ యు పొ లేదంటే లిండా (బల్గేరియా)తో తలపడే అవకాశముంది. ఇందులో గెలిస్తే... తదుపరి రౌండ్లో బీవెన్‌ జంగ్‌ (అమెరికా)ను ఎదుర్కొంటుంది. ఈ అడ్డంకులన్నీ దాటితే క్వార్టర్స్‌లో తైపీ స్టార్‌ తై జు యింగ్‌ ఎదురయ్యే అవకాశాలున్నాయి.   

మరిన్ని వార్తలు