తలైవా రాజకీయ తెరంగేట్రానికి ముహూర్తం..?

17 Aug, 2019 06:38 IST|Sakshi

మార్చిలో పార్టీ ప్రారంభం?

తమిళనాడు, పెరంబూరు: తలైవా రాజకీయాల్లోకి రావా? ఇది రజనీకాంత్‌ అభిమానుల చిరకాల ఆకాంక్ష. ‘పైవాడు ఆదేశిస్తే నేను పాఠిస్తా. రావాల్సిన సమయంలో కచ్చితంగా వస్తా. నా రాజకీయ ప్రవేశం తధ్యం’. ఇవి 20 ఏళ్లుగా నటుడు రజనీకాంత్‌ చేస్తున్న వ్యాఖ్యలు. కాగా ఎట్టకేలకు 2017 డిసెంబరులో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నాను. త్వరలోనే పార్టీని ప్రారంభించనున్నా అని స్థానిక కోడంబాక్కంలోని  శ్రీరాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులను సమావేశ పరిచి రజనీకాంత్‌ వెల్లడించారు. అదే సమయంలో రానున్న శాసనసభ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లోనూ మన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. తన అభిమాన సంఘాలను రజనీ ప్రజా సంఘాలుగా మార్చి, నాయకులను నియమించడంతో పాటు ప్రాంతాల వారీగా  బూత్‌ కమిటీలను ఏర్పాటు చేసి కోటి మంది సభ్యుల నమోదును టార్గెట్‌గా వారి ముందుంచారు. రజనీకాంత్‌ దిశనిర్దేశాల ప్రకారం ఆయన అభిమానులు ఉత్సాహం ఉరకలేయడంతో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి స్వీకారం చుట్టి టార్గెట్‌ను రీచ్‌ చేశారు.

దూరంగా దగ్గరగా..
కాగా రాజకీయ రంగప్రవేశం గురించి ప్రటించిన రజనీకాంత్‌ ఆ తరువాత ఆ దిశగా పెద్దగా అడుగులు వేసిన సందర్భాలు లేవనే చెప్పాలి. అప్పుడప్పుడూ నామమాత్రంగా అభిమానులతోనూ, తన సన్నిహితులైన నాయకీయ నాయకులతోనూ భేటీ అవుతూ వచ్చారు. ఇక రాష్ట్ర సమస్యల గురించి పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. మరో విషయం ఏమిటంటే గత లోక్‌సభ ఎన్నికల ముందు వరకూ బీజేపీకి ఇతర రాజకీయ పార్టీలకు సమ దూరాన్ని పాటించిన రజనీకాంత్‌ ఎప్పుడైతే బీజేపీ లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిందో అప్పటి నుంచి ఆయన స్వరం మార్చారు. లోక్‌సభ ఎన్నికల ముందు దూరంగా ఉన్న రజనీకాంత్‌ ఆ తరువాత బీజేపీకి దగ్గరగా రావడం మొదలెట్టారు. ఆ పార్టీకి అనుకూలంగా గొంతు విప్పడంతో ఆయనపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజనీకాంత్‌ ఒంటరిగా పోటీ చేసే సాహసానికి ధైర్యం చేయలేకపోతున్నారనే నిర్ణయానికి వచ్చేశారు. కాగా ఇటీవల చెన్నైలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేం ద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు పాల్గొన్న రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన ఆలోచనలు పూర్తిగా తేటతెల్లపడిచాయనేచెప్పాలి. అంతే కాదు ఎప్పుడైతే మోదీ, అమిత్‌షాలను కృష్ణార్జులుగా పోల్చుతూ, కశ్మీర్‌ వ్యవహారాన్ని సమర్ధించారో పత్రిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అంతే కాదు రజనీకాంత్‌ బీజేపీతో కూటమికి ఆసక్తి చూపుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయన తన వ్యాఖ్యలను ఎంతగా సమర్ధించుకోవాలని ప్రయత్నించినా, పడాల్సిన ముద్ర పడిపోయింది. రానున్న శాసన సభ ఎన్నికల్లో రజనీకాంత్‌ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీలతో కూటమికి సిద్ధపడుతున్నారనే ప్రచారానికి ఆయనే తావిచ్చారు.

మార్చిలో పార్టీ ప్రారంభం
మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ తన అధికార కాలాన్ని పూర్తి చేసుకుంటుందని నమ్మిన రజనీకాంత్‌ ఇప్పట్లో తాను పార్టీని ప్రారంభించినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించినట్లు ఆయన సన్నిహితుల మాట.  దీంతో పార్టీ ప్రారంభం విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని భావించిన రజనీకాంత్‌ శాసనసభ ఎన్నికలకు ఒక ఏడాది ముందు పార్టీని ప్రారంభించి జెండా, ఎజెండాలను వెల్లడించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో శాసనసభ ఎన్నికలు 2021లో జరగనున్నాయి కాబట్టి 2020లో పార్టీని ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. దీంతో వచ్చే ఏడాది మార్చి నెలలో రజనీకాంత్‌ పార్టీని ప్రారంభించి ప్రజాక్షేత్రంలోకి వెళ్లడానికి ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. కాగా రజనీకాంత్‌ బీజేపీతో పొత్తు గురించి బహిరంగా వెల్లడించకపోయినా, పొత్తుకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అయితే బీజేపీ మాత్రం ఆయతో పెత్తు పెట్టుకోకుండా తమకు మద్దుతుదారుడిగానే వాడుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ఒక టాక్‌ ఉంది. అయితే రాజకీయాల్లో చివరి నిమిషంలో ఏమైనా జరగవచ్చు. మొత్తం మీద 2021 శాసనసభ ఎన్నికల్లో తమిళ రాజకీయ పటం పలు మార్చులకు గురి కాబోతోంది.

మరిన్ని వార్తలు