ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం

10 Aug, 2013 01:06 IST|Sakshi
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో సింధుకు పతకం ఖాయం

 కలయా... నిజమా... గురువు పుల్లెల గోపీచంద్‌తో సాధ్యం కానిది.... తన ఆదర్శ క్రీడాకారిణి సైనాకు అందని ద్రాక్షగా ఉన్న ఘనతని... తన తొలి ప్రయత్నంలోనే పూసర్ల వెంకట సింధు సాధించింది. 18 ఏళ్ల ఈ అచ్చ తెలుగు అమ్మాయి శుక్రవారం భారత బ్యాడ్మింటన్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించింది. చైనా గడ్డపై వరుసగా రెండో మ్యాచ్‌లో చైనా ప్లేయర్‌నే చిత్తు చేసి ‘డ్రాగన్’ పీచమణిచింది. ప్రతిష్టాత్మక ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సెమీఫైనల్‌కు చేరుకొని పతకాన్ని ఖాయం చేసుకుంది. ఈ క్రమంలో మహిళల సింగిల్స్ విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.
 
 ‘మాకు తిరుగులేదు అని కాలర్ ఎగిరేసే చైనీయుల కుంభస్థలం మీద కొట్టాలనుకుందో’...
 ‘అరుదైన ఘనతకు అడుగు దూరంలో నిలిచిపోయిన సైనా, కశ్యప్‌ల బాధను కాస్తయినా తగ్గించాలనుకుందో’..
 ‘అపర ద్రోణుడిలా అహర్నిశలు శ్రమిస్తున్న గురువు గోపీచంద్‌కు అద్భుత కానుక
 ఇవ్వాలనుకుందో’...
 మొత్తానికి తెలుగు తేజం పి.వి. సింధు అద్భుతమే చేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా... బరిలోకి దిగిన తొలి ప్రయత్నంలోనే ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకుంది. గురువారం మూడో రౌండ్‌లో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్, రెండో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)పై సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపిస్తూ ఈ 18 ఏళ్ల అమ్మాయి మరో సంచలనం సృష్టించింది.
 
 అశేష చైనా అభిమానుల నడుమ ఒత్తిడిని తట్టుకుంటూ మరో గొప్ప విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 10వ సీడ్ సింధు 21-18, 21-17తో 7వ సీడ్ షిజియాన్ వాంగ్ (చైనా)ను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఈ మెగా ఈవెంట్ నిబంధనల ప్రకారం సెమీఫైనల్ చేరినవారికి కనీసం కాంస్య పతకం లభిస్తుంది. శనివారం జరిగే సెమీఫైనల్లో నాలుగో సీడ్ ఇంతనోన్ రత్చనోక్ (థాయ్‌లాండ్)తో సింధు తలపడుతుంది. ఇంతనోన్‌తో ముఖాముఖిలో సింధు 0-1తో వెనుకబడి ఉంది.
 
 ఆద్యంతం ఆధిపత్యం....
 ఈ ఏడాది ఏప్రిల్‌లో చైనీస్ తైపీలో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో షిజియాన్ వాంగ్‌ను ఓడించిన సింధు అదే ఫలితాన్ని ప్రపంచ చాంపియన్‌షిప్‌లోనూ పునరావృతం చేసింది. సొంతగడ్డపై ఆడుతున్న షిజియాన్‌కు ప్రేక్షకుల మద్దతు లభించినా సింధు ఈ అంశాన్ని అంతగా పట్టించుకోకుండా తన ప్రణాళికను అమలు చేసింది.
 
  సుదీర్ఘ ర్యాలీలు ఆడుతూ... అడపాదడపా స్మాష్ షాట్‌లు సంధిస్తూ... సింధు ఆరంభం నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించింది. తొలి గేమ్ ఆరంభంలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి 6-3తో ఆధిక్యంలోకి వెళ్లిన సింధు ఆ తర్వాత దీనిని కాపాడుకుంది. షిజియాన్ తేరుకునే ప్రయత్నం చేసినా సింధు ఏదశలోనూ సంయమనం కోల్పోకుండా చైనా స్టార్‌ను కట్టడి చేసింది. రెండో గేమ్ ఆరంభంలో సింధు మరోసారి చెలరేగింది. వరుసగా ఐదు పాయింట్లు నెగ్గి 6-2తో ముందంజ వేసింది. ఈ నాలుగు పాయింట్ల ఆధిక్యాన్ని తగ్గించాలని, స్కోరును సమం చేయాలని షిజియాన్ కృషి చేసినా ఆమె ఆటలు సింధు ముందు సాగలేదు.
 
 మూడో పతకం...: సింధు సెమీఫైనల్‌కు చేరుకోవడంతో ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో భారత్ ఖాతాలో మూడో పతకం చేరనుంది. 30 ఏళ్ల క్రితం 1983లో డెన్మార్క్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ విభాగంలో దిగ్గజం ప్రకాశ్ పదుకొనే సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాన్ని సాధించారు. మూడు దశాబ్దాల తర్వాత సింధు ఈ మెగా ఈవెంట్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లి ప్రకాశ్ పదుకొనే సరసన నిలిచింది. 2011లో ఇంగ్లండ్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప జోడి మహిళల డబుల్స్‌లో కాంస్యం సాధించింది.
 
 సైనా... నాలుగో‘సారీ’
 గ్వాంగ్‌జూ (చైనా): అన్నీ కలిసొచ్చాయి. కానీ ఆటతీరే బాగోలేదు. ఫలితంగా భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఈ ఏడాది మరోసారి నిరాశపరిచింది. అందని ద్రాక్షగా ఊరిస్తున్న ప్రపంచ చాంపియన్‌షిప్ పతకాన్ని గెల్చుకోవడంతో ఈ హైదరాబాద్ అమ్మాయి నాలుగోసారీ విఫలమైంది. గత మూడు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో (2009-హైదరాబాద్), (2010-పారిస్), (2011-లండన్) క్వార్టర్ ఫైనల్స్‌లో నిష్ర్కమించిన సైనా నాలుగోసారీ ఈ అడ్డంకిని దాటలేకపోయింది. సెమీఫైనల్ చేరుకుంటే కనీసం కాంస్య పతకం ఖాయమయ్యే స్థితిలో బరిలోకి దిగిన సైనా ఒత్తిడిని తట్టుకోలేకపోయింది. స్థాయికితగ్గ ఆటతీరును ప్రదర్శించడంలో విఫలమై రిక్తహస్తాలతో తిరిగిరానుంది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ సైనా 21-23, 9-21తో 13వ సీడ్ యోన్ జూ బే (దక్షిణ కొరియా) చేతిలో ఓడిపోయింది. 40 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సైనా తొలి గేమ్‌లో ఆకట్టుకున్నా రెండో గేమ్‌లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది. తొలి గేమ్‌లో 14-7తో స్పష్టమైన ఆధిక్యంలో ఉన్న సైనా ఆ తర్వాత అనవసర తప్పిదాలతో తన ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది.
 
 21-20తో గేమ్ పాయింట్ వద్ద నిలిచిన సైనా వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి గేమ్‌ను చేజార్చుకుంది. రెండో గేమ్‌లో సైనా ఏమాత్రం పోటీనివ్వలేకపోయింది. ఆరంభంలో 5-4తో ఆధిక్యంలో ఉన్నా మళ్లీ తడబడింది. వరుసగా ఐదు పాయింట్లు సమర్పించుకొని 5-9తో వెనుకబడింది. ఆ తర్వాత స్కోరు 9-14 వద్ద ఉన్నపుడు సైనా వరుసగా ఏడు పాయింట్లు కోల్పోయి పరాజయాన్ని ఖాయం చేసుకుంది.
 
 ‘వరుసగా సింధు రెండు కఠినమైన మ్యాచ్‌లు ఆడింది. సెమీస్ ప్రత్యర్థి కూడా బలమైన క్రీడాకారిణి. సింధు రాణిస్తుందనే నమ్మకం ఉంది. ఓవరాల్‌గా సింధు అద్భుతంగా ఆడుతోంది. సైనాకు ఆరోగ్యం సరిగా లేదు. అందుకే తొలి గేమ్ తర్వాత శక్తిని కోల్పోయింది. ఆమె వయసు కేవలం 23 ఏళ్లే. కాబట్టి పుంజుకుంటుంది. మంచి నైపుణ్యం ఉన్న క్లాస్ ప్లేయర్ సైనా. తన కెరీర్‌కు వచ్చిన నష్టమేమీ లేదు.’    
 - కోచ్ గోపీచంద్
 
 గోపీచంద్‌కు అంకితం
 ‘సింధు ఘనత పట్ల మేం గర్విస్తున్నాం. డ్రా కఠినంగా ఉండటం వల్ల తనపై మాకు ఎలాంటి అంచనాలు లేవు. సెమీస్‌కు చేరడం అనేది మేం ఊహించని గొప్ప ఘనత. సింధు విషయంలో గోపీచంద్ సపోర్ట్ స్టాఫ్‌ను బాగా వినియోగించారు. సింధు విజయాల్లో గోపీ కృషిని మరువలేం. ఈ విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాం. ఎత్తు ఎక్కువ ఉండటం సింధు బలం. ఎవ్వరికీ భయపడదు. ప్రత్యర్థి ఎవరైనా నా ఆట నేను ఆడతా అంటుంది. ఈ దృక్పథం వల్లే చైనా క్రీడాకారిణులను ఓడిస్తోంది’.
 - పి.వి.రమణ, విజయ (సింధు తల్లిదండ్రులు)
 
 ప్రశంసల వెల్లువ
 సింధుపై అభినందనల వర్షం కురిసింది. ‘ఈ టోర్నీలో చాంపియన్‌గా నిలిచే సత్తా ఆమెలో ఉంది.ఆల్ ది బెస్ట్ సింధు’ అంటూ భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు అఖిలేశ్ దాస్ గుప్తా అభినందించారు. దేశంలో బ్యాడ్మింటన్‌కు ప్రధానకేంద్రంగా మారిన హైదరాబాద్ నుంచి మరో క్రీడాకారిణి సంచలనం సృష్టించడం గర్వకారణమని... ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి పున్నయ్యచౌదరి అన్నారు.
 
 పాపం... కశ్యప్
 మ్యాచ్ పాయింట్ చేజార్చుకొని ఓటమి
 ఒక్క పాయింట్ సాధించి ఉంటే చరిత్ర సృష్టించే అవకాశాన్ని పారుపల్లి కశ్యప్ చేజార్చుకున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో 13వ సీడ్ కశ్యప్ 21-16, 20-22, 15-21తో మూడో సీడ్ డూ పెంగ్యూ (చైనా) చేతిలో ఓడిపోయాడు. 75 నిమిషాలపాటు జరిగిన ఈ పోటీలో కశ్యప్ తొలి గేమ్‌ను నెగ్గి రెండో గేమ్‌లో 20-19తో మ్యాచ్ పాయింట్‌ను సంపాదించాడు.
 
 ఈ దశలో పాయింట్ సాధించి ఉంటే కశ్యప్ విజయం సాధించడంతోపాటు సెమీఫైనల్‌కు చేరుకొని కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకునేవాడు. కానీ డూ పెంగ్యూ పట్టుదలతో పోరాడి మ్యాచ్ పాయింట్‌ను కాచుకోవడమేకాకుండా రెండో గేమ్‌ను సొంతం చేసుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో కశ్యప్ ఒకదశలో 12-8తో ఆధిక్యంలో ఉన్నప్పటికీ ఈ ఆధిక్యాన్ని కాపాడుకోలేకపోయాడు. వరుసగా ఏడు పాయింట్లు సమర్పించుకొని 12-15తో వెనుకబడిపోయాడు. ఆ తర్వాత కశ్యప్ తేరుకోలేకపోయాడు.
 
 ఏకకాలంలో....
 శుక్రవారం సైనా నెహ్వాల్, కశ్యప్ మ్యాచ్‌లు ఏకకాలంలో పక్క పక్క కోర్టుల్లో జరిగాయి. కశ్యప్ తొలి గేమ్‌ను సొంతం చేసుకునేసరికి సైనా తన తొలి గేమ్‌లో ఆధిక్యంలో ఉంది. రెండో గేమ్‌లో కశ్యప్ 0-7తో వెనుకబడి ఆ తర్వాత కోలుకున్నాడు. ఒకదశలో వరుసగా ఆరు పాయింట్లు నెగ్గి 18-16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత కశ్యప్ మ్యాచ్ పాయింట్ సంపాదించాడు. అదే దశలో సైనా కూడా గేమ్ పాయింట్‌ను సంపాదించింది. కానీ కశ్యప్ మ్యాచ్ పాయింట్‌ను కాపాడుకోలేకపోయాడు. సైనా కూడా గేమ్‌ను దక్కించుకోలేకపోయింది.
 

మరిన్ని వార్తలు