పదేళ్ల తర్వాత ఫైనల్లోకి...

20 Dec, 2017 00:17 IST|Sakshi

రంజీ ట్రోఫీ టైటిల్‌ పోరుకు ఢిల్లీ

సెమీస్‌లో బెంగాల్‌పై ఇన్నింగ్స్‌ 

26 పరుగుల తేడాతో విజయం

పుణే: యువ పేస్‌ బౌలర్లు నవదీప్‌ సైని, కుల్వంత్‌ ఖెజ్రోలియా  నిప్పులు చెరిగే బంతులతో హడలెత్తించడంతో... బెంగాల్‌తో మూడు రోజుల్లోనే ముగిసిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ఢిల్లీ జట్టు ఇన్నింగ్స్‌ 26 పరుగులతో ఘనవిజయం సాధించింది. పదేళ్ల తర్వాత దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీలో ఢిల్లీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 12 ఓవర్లు వేసిన నవదీప్‌ 35 పరుగులిచ్చి నాలుగు వికెట్లు... 8.4 ఓవర్లు వేసిన కుల్వంత్‌ 40 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టారు. ఈ ఇద్దరు పేసర్ల ధాటికి బెంగాల్‌ రెండో ఇన్నింగ్స్‌లో 24.4 ఓవర్లలో 86 పరుగులకే కుప్పకూలింది. సైని వేసిన బంతులు ఆడలేక సుదీప్‌ చటర్జీ (21), కెప్టెన్‌ మనోజ్‌ తివారీ (14), అమీర్‌ ఘనీ (0), అమిత్‌ (0) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యారు. మ్యాచ్‌ మొత్తంలో ఏడు వికెట్లు తీసిన నవదీప్‌ సైనికే మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది.

అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 271/3తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఢిల్లీ జట్టు 398 పరుగులకు ఆలౌటై 112 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. బెంగాల్‌ పేసర్‌ మొహమ్మద్‌ షమీ (6/122) దెబ్బకు ఢిల్లీ జట్టు తమ చివరి 7 వికెట్లను 127 పరుగులకే కోల్పోయింది. ‘మ్యాచ్‌కు ముందు ఢిల్లీ జట్టును బెంగాల్‌ కెప్టెన్‌ మనోజ్‌ తివారీ తేలిగ్గా తీసుకున్నాడు. ఢిల్లీ జట్టుకు పాఠం నేర్పిస్తామని తివారీ వ్యాఖ్యానించినట్లు చదివాను. గంభీర్, నవదీప్‌ సైని, రిషభ్‌ పంత్‌లాంటి ఆటగాళ్లున్న ఢిల్లీని సునాయాసంగా ఓడిస్తామని అతను ఎలా అనుకున్నాడు. మా ప్రదర్శనతో తివారీకి తగిన సమాధానం ఇచ్చాం’ అని ఢిల్లీ జట్టు కోచ్‌ కేపీ భాస్కర్‌ వ్యాఖ్యానించారు. 
 

పోరాడుతున్న విదర్భ 
కోల్‌కతాలో కర్ణాటకతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో విదర్భ జట్టు పోరాడుతోంది. 116 పరుగులతో వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విదర్భ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 195 పరుగులు చేసి 79 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. సతీశ్‌ (71 బ్యాటింగ్‌), అక్షయ్‌ (19 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 294/8తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన కర్ణాటక 301 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో కరుణ్‌ నాయర్‌ (153), వినయ్‌ కుమార్‌ మరో ఏడు పరుగులు జోడించి అవుటయ్యారు.  

మరిన్ని వార్తలు