రోహిత్‌ ఆ రికార్డులు అందుకునేనా?

21 Nov, 2018 12:07 IST|Sakshi
రోహిత్‌ శర్మ

బ్రిస్బేన్‌ : అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియా పర్యటనకు నేటితో తెరలేవనుంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో బుధవారం జరుగనున్న తొలి పోరులో భారత్‌... ఆసీస్‌ను ఢీ కొననుంది. ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించి చరిత్ర సృష్టించాలని భారత్‌ భావిస్తుండగా.. వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఆతిథ్య జట్టు ఈ సిరీస్‌లో పైచేయి సాధించి పూర్వవైభవం దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. (చదవండి: ఎదురుందా మ‌న‌కు?)   

అయితే ఈ సిరీస్‌లో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మను కొన్ని రికార్డులు ఊరిస్తున్నాయి.  టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌ జాబితాలో అగ్రస్థానం అందుకోవాలంటే రోహిత్‌ ఇంకా 65 పరుగులు చేయాలి. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20ల్లోనే ఈ హిట్‌ మ్యాన్‌ ఈ ఘనత అందుకుంటాడని అందరు భావించారు. కానీ అతను ఆ మ్యాచ్‌లో విఫలమై నిరాశపరిచాడు. ఈ జాబితాలో న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ మార్టన్‌ గప్టిల్‌ 2,271 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్‌ 2,207 పరుగులతో తరువాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మూడు టీ20ల సిరీస్‌లో రోహిత్‌ ఈ ఘనతనందుకుంటాడని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఆ మజానే వేరు!)

ఇక అంతేకాకుండా ఒక క్యాలెండర్‌ సంవత్సరంలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు నమోదు చేయడానికి కూడా రోహిత్‌ చేరువలో ఉన్నాడు. ఈ ఏడాది అతను 560 పరుగుల చేశాడు. మరో 81 పరుగులు చేస్తే టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 2016లో 641 పరుగులతో నెలకొల్పిన రికార్డును అధిగమిస్తాడు. ఇక మరో 4 సిక్స్‌లు బాదితే టీ20ల్లో 100 సిక్స్‌లు కొట్టిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రోహిత్‌ రికార్డు సృష్టించనున్నాడు. ప్రస్తుతం ఈ హిట్‌ మ్యాన్‌ ఫామ్‌ను చూస్తే ఈ రికార్డులను సులువుగా అందుకుంటాడనడంలో అతిశయోక్తి లేదు. (చదవండి: స్మిత్, వార్నర్‌ లేని ఆసీస్‌... కోహ్లి, రోహిత్‌ లేని భారత్‌ )

మరిన్ని వార్తలు