దేశం మారే యోచనలో క్రికెటర్ శ్రీశాంత్

21 Oct, 2017 08:48 IST|Sakshi

న్యూఢిల్లీ:2013–ఐపీఎల్‌లో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఉదంతంలో నిందితుడైన క్రికెటర్ శ్రీశాంత్ వేరే దేశం తరపున క్రికెట్ ఆడే యోచనలో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా శ్రీశాంత్ పట్ల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) వ్యవహరిస్తున్న వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన అతను ఇక టీమిండియాకు ఆడే అవకాశం లేకపోవచ్చనే అభిప్రాయానికి వచ్చాడు. దీనిలో భాగంగా తాను వేరే దేశానికి ప్రాతినిథ్యం వహించాలనుకున్నట్లు ప్రముఖ వార్తా సంస్థ ఆసియా నెట్ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్య్యూలో స్పష్టం చేశాడు. ఒకవేళ బీసీసీఐ తనపై నిషేధాన్ని కొనసాగిస్తే మాత్రం తన దారి తాను చూసుకుంటాననే హెచ్చరికలు జారీ చేశాడు.

'నన్ను బీసీసీఐ నిషేధించింది. అంతేకానీ ఐసీసీ కాదు. అంటే నేను భారత్ మాత్రం ఆడకూడదు. వేరే దేశానికి క్రికెట్ ఆడొచ్చు కదా. నా వయసు ఇంకా 34 ఏళ్లే. నా కెరీర్ చాలా ఉంది. ఇంకా ఆరేళ్లుగా పైగా క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఒక వ్యక్తిగా నాకు క్రికెట్ అంటే ఇష్టం. అందుచేత క్రికెట్ నే ఆడాలనుకుంటున్నా. బీసీసీఐ అనేది ఒక ప్రైవేట్ సంస్థ. అలానే వేరే దేశానికి క్రికెట్ ఆడతా. నాపై నిషేధం కొనసాగించే నిర్ణయం బీసీసీఐకే వదిలేశా. ఇక్కడ కేరళ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం వేరు'అని దుబాయ్ లో జరిగిన ఒక పబ్లిక్ ఈవెంట్ కు హాజరైన సందర్భంలో శ్రీశాంత్ స్పష్టం చేశాడు. గత కొన్ని రోజుల క్రితం స్పాట్‌ ఫిక్సింగ్‌కు పాల్పడిన పేస్‌ బౌలర్‌ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేధం కొనసాగుతుందని జస్టిస్‌ నవనీతి ప్రసాద్‌ సింగ్, జస్టిస్‌ రాజా విజయరాఘవన్‌లతో కూడిన కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.

శ్రీశాంత్‌పై నిషేధం కొనసాగుతుంది

మరిన్ని వార్తలు