ధావన్‌ ఆగయారే..

21 Jul, 2019 14:39 IST|Sakshi

విండీస్‌ పర్యటనకు జట్టును ప్రకటించిన బీసీసీఐ

న్యూఢిల్లీ : బొటనవేలి గాయంతో ప్రపంచకప్‌ నుంచి అర్థాంతరంగా తప్పుకున్న టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపికయ్యాడు. ఆగస్టు 3 నుంచి మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడేందుకు వెస్టిండీస్‌లో పర్యటించనున్న భారత జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న ధావన్‌ను సెలెక్టర్లు లిమిటెడ్‌ ఓవర్స్‌ ఫార్మాట్‌కు ఎంపిక చేయగా.. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాకు విశ్రాంతినిస్తూ మూడు ఫార్మాట్లకు దూరం పెట్టారు.

ప్రపంచకప్‌ ఓటమి నేపథ్యంలో ఇద్దరి కెప్టెన్ల ప్రతిపాదన వచ్చినప్పటికీ.. మూడు ఫార్మాట్‌లకు కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లినే ప్రకటించారు. లిమిటెడ్‌ ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, టెస్ట్‌లకు అజింక్యా రహానే వైస్‌ కెప్టెన్‌ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇక ఎన్నాళ్ల నుంచో భారత జట్టును వేధిస్తున్న నాలుగో స్థానం సమస్య సమస్యగానే మిగిలిపోవడం.. ప్రపంచకప్‌ కూడా అదే కారణంతో చేజారడంతో సెలక్టర్లు ఆ దిశగా దృష్టిసారించారు. ఈ సిరీస్‌ ద్వారా ఆ సమస్యకు పరిష్కారం కనుగొనాలని భావించి యువ ఆటగాళ్లు శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండేలకు జట్టులో స్థానం కల్పించారు. భారత్‌-ఏ జట్టు తరఫున విండీస్‌ పర్యటనలోనే ఉన్న ఈ ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో జట్టులో చోటు దక్కించుకున్నారు.

సీనియర్‌ వికెట్‌ కీపర్‌ మహేంద్రసింగ్‌ ధోని సెలవుతో రిషబ్‌ పంత్‌ ఆ స్థానాన్ని దక్కించుకోగా.. టెస్ట్‌లకు వృద్ధిమాన్‌ సాహాను ప్రత్యామ్నయ కీపర్‌గా ఎంపిక చేశారు. ఇక చహల్‌ను టీ20, టెస్ట్‌లకు దూరం పెట్టగా.. కుల్దీప్‌ను టీ20లకు ఎంపిక చేయలేదు.  యార్కర్ల కింగ్‌ జస్ప్రిత్‌ బుమ్రాను టెస్ట్‌లకు మాత్రమే ఎంపిక చేశారు. ప్రపంచకప్‌ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రోహిత్‌ టెస్టుల్లో సైతం చోటు దక్కించుకున్నాడు. టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారా, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ టెస్ట్‌ జట్టులో చోటుదక్కించుకున్నారు.

టీ20 జట్టు: విరాట్‌​ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండె, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుంధర్‌, రాహుల్‌ చహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చహర్‌, నవదీప్‌ సైనీ

వన్డే జట్టు: విరాట్‌​ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీష్‌ పాండె, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌‌, యజువేంద్ర చహల్‌‌, కేదార్‌ జాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, ఖలీల్‌ అహ్మద్‌,  నవదీప్‌ సైనీ
 
టెస్ట్‌ జట్టు: విరాట్‌​ కోహ్లి (కెప్టెన్‌), అజింక్యా రహానే(వైస్‌ కెప్టెన్‌), మయాంక్‌ అగర్వాల్‌‌, కేఎల్‌ రాహుల్‌, పుజారా‌, హనుమ విహరి, రోహిత్‌ శర్మ, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), వృద్ధిమాన్‌ సాహా, అశ్విన్‌, జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ, జస్ప్రిత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్‌

>
మరిన్ని వార్తలు