గోపీచంద్ అకాడమీతో ‘సాయ్’ ఒప్పందం

25 Nov, 2015 01:49 IST|Sakshi
గోపీచంద్ అకాడమీతో ‘సాయ్’ ఒప్పందం

న్యూఢిల్లీ: పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ ఫౌండేషన్ (పీజీబీఎఫ్), భారత క్రీడాప్రాధికార సంస్థ (సాయ్) మధ్య పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. దీంతో హైదరాబాద్‌లోని ఈ అకాడమీ ఇక నుంచి సాయ్ గోపీచంద్ జాతీయ బ్యాడ్మింటన్ అకాడమీగా మారనుంది. సాయ్ డెరైక్టర్ జనరల్ ఇంజేటి శ్రీనివాస్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. దీంట్లో భాగంగా జాతీయ క్రీడా అభివృద్ధి నిధి సహాయంతో పీజీబీఎఫ్‌లో సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే జాతీయ శిక్షణ శిబిరాలు, పోటీలకు అకాడమీలో ఉన్న సౌకర్యాలను సాయ్ వినియోగించుకోనుంది. మరోవైపు జాతీయ స్థాయి ప్రతిభాన్వేషనలో భాగంగా నైపుణ్యం కలిగిన 11 నుంచి 14 ఏళ్ల లోపు 50 మంది చిన్నారులను అకాడమీ ఎంపిక చేయనుంది. తమ కోచ్‌లనే కాకుండా ప్రభుత్వ రంగ సంస్థలైన ఓఎన్జీసీ, రైల్వేస్ ఇంతర కేంద్ర సంస్థలు, రాష్ట్ర పీఎస్‌యూల నుంచి కోచ్‌లను సాయ్ బదిలీ చేయనుంది.

‘దేశంలోని క్రీడా కోచింగ్‌ను మరింతగా రాటుదేల్చేందుకు ఇది రోల్ మోడల్‌గా పనిచేస్తుంది’ అని సాయ్ డీజీ శ్రీనివాస్ అన్నారు. దేశంలో క్రీడాభివృద్ధికి సాయ్‌తో జతకట్టడం ఆనందంగా ఉందని కోచ్ గోపీచంద్ తెలిపారు. భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) కూడా ఇందులో భాగస్వామి అవుతుందని అన్నారు.

మరిన్ని వార్తలు