సంగక్కర x డివిలియర్స్

18 Mar, 2015 00:45 IST|Sakshi
సంగక్కర x డివిలియర్స్

ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్ నేడులంకతో దక్షిణాఫ్రికా పోరు
 
క్రికెట్ అభిమానుల కోసం అసలు సిసలు విందు సిద్ధమైంది. ఇక ఏ జట్టైనా సరే తప్పు చేస్తే కోలుకోవడానికి అవకాశం ఉండదు. ప్రతి మ్యాచ్‌లోనూ ఉత్కంఠే. ప్రతి బంతీ పరీక్షే. క్వార్టర్ ఫైనల్ సమరంలో అమీతుమీ తేల్చుకునేందుకు ఎనిమిది జట్లు సిద్ధమయ్యాయి. నాకౌట్ సమరంలో తొలి మ్యాచ్ నేడు శ్రీలంక, దక్షిణాఫ్రికాల మధ్య జరగనుంది. అవటానికి రెండు జట్ల మధ్య పోరే అయినా... వరుస శతకాలతో సంచలన ఫామ్‌లో ఉన్న సంగక్కరకు, ఒంటిచేత్తో జట్టు భారాన్ని మోస్తున్న డివిలియర్స్‌కు మధ్య సమరం ఇది. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో..!
 
 సిడ్నీ: వరుసగా రెండు ప్రపంచకప్ ఫైనల్స్‌లో పరాజయం, ఈ సారైనా టైటిల్ సాధించి తమ దిగ్గజాలకు చిరస్మరణీయ వీడ్కోలు పలకాలని, ఈ క్రమంలో మూడు అడుగుల్లో మొదటిది విజయవంతంగా వేయాలని భావిస్తున్న శ్రీలంక ఒక వైపు...వరుసగా ఐసీసీ టోర్నీలలో ఆరు నాకౌట్ మ్యాచ్‌లలో పరాజయంపాలై వీరి వల్ల కాదంటూ ముద్ర వేయించుకొని...ఆ అపవాదునుంచి బయట పడాలని పట్టుదలగా ఉన్న దక్షిణాఫ్రికా మరో వైపు... ప్రపంచకప్‌లో క్వార్టర్స్ దశ ఆసక్తికర మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. సిడ్నీ క్రికెట్ మైదానంలో జరిగే ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, శ్రీలంక తలపడుతున్నాయి. ప్రస్తుత ఫామ్, ఆటగాళ్ల బలాబలాలు చూస్తే ఇరు జట్లు సమ ఉజ్జీలుగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది.
 
జట్ల వివరాలు (అంచనా):
శ్రీలంక: మ్యాథ్యూస్ (కెప్టెన్), తిరిమన్నె, దిల్షాన్, సంగక్కర, జయవర్ధనే, కుషాల్ పెరీరా, తిసార పెరీరా, కులశేఖర, మలింగ, హెరాత్/ప్రసన్న, లక్మల్/ చమీరా. దక్షిణాఫ్రికా: డివిలియర్స్ (కెప్టెన్), ఆమ్లా, డి కాక్, డు ప్లెసిస్, డుమిని, మిల్లర్, రోసో, ఫిలాం డర్, మోర్కెల్, స్టెయిన్, తాహిర్.
 
దిల్షాన్ X స్టెయిన్
టోర్నీలో రెండు సెంచరీలు సహా 395 పరుగులతో దిల్షాన్ ఫామ్‌లో ఉన్నాడు. అటు వైపు 9 వికెట్లు తీసిన స్టెయిన్ సఫారీల కీలక బౌలర్. షార్ట్ పిచ్ బంతులతో చెలరేగి అతను దిల్షాన్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తాడు. ఆరంభంలోనే వికెట్ పడగొట్టగలిగితే దక్షిణాఫ్రికాకు పట్టు చిక్కుతుంది. అయితే జాన్సన్‌ను చితక్కొట్టిన దిల్షాన్... స్టెయిన్‌ను ఎలా ఎదుర్కొంటాడన్నది ఆసక్తికరం.
 
దక్షిణాఫ్రికా: ఐదో బౌలర్ సమస్య
దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కూడా చాలా బలంగా కనిపిస్తోంది. డివిలియర్స్ అనూహ్య రీతిలో చెలరేగిపోతున్నాడు. అతను మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే లంకకు కష్టాలు తప్పవు. బ్యాటింగ్‌లో ఆమ్లా కూడా నిలకడ ప్రదర్శించాడు. గాయంనుంచి కోలుకున్న డు ప్లెసిస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మిల్లర్, డుమిని కూడా కీలక ఆటగాళ్లు. కీపర్ డి కాక్ అన్ని మ్యాచ్‌లలో విఫలమైనా, అతను కొనసాగే అవకాశం ఉంది. అయితే దక్షిణాఫ్రికా ఆర్డర్ చూస్తే పేరు గొప్ప...లాగా ఉంది. ఎందుకంటే ముందుగా బ్యాటింగ్ చేస్తే ఇరగదీస్తున్న జట్టు బ్యాట్స్‌మెన్... లక్ష్యఛేదనలో తేలిపోతున్నారు.

ప్రపంచకప్‌లో ఇది బాగా కనిపించింది. ఐర్లాండ్, వెస్టిండీస్‌లపై 400కు పైగా పరుగులు చేసిన ఆ జట్టు భారత్‌పై 307, పాక్‌తో 232 పరుగులు ఛేదించలేక చతికిలపడింది. గత ప్రపంచకప్‌నుంచి 13 సందర్భాల్లో 250కు పైగా లక్ష్యాన్ని ఛేదించాల్సి వస్తే...సఫారీలు 3 మ్యాచ్‌లు మాత్రమే గెలవగలిగారు. ఇదే బలహీనతపై దెబ్బ కొట్టాలంటే టాస్ గెలిస్తే లంక ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. ఇక ఫైర్ పవర్ అనుకున్న దక్షిణాఫ్రికా బౌలింగ్ ఏమంత గొప్పగా లేదు.

స్టెయిన్ ఈ టోర్నీలో పవర్‌ప్లేలలో 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు. మోర్నీ మోర్కెల్ ప్రభావం చూపలేకపోగా... అబాట్, ఫిలాండర్‌లలో ఎవరు బరిలోకి దిగినా పెద్దగా తేడా రాకపోవచ్చు. స్పిన్నర్‌గా తాహిర్ 13 వికెట్లతో మంచి ప్రదర్శన కనబర్చాడు కానీ లంక స్పిన్‌ను సునాయాసంగా ఎదుర్కోగలదు. అన్నింటికి మించి ఐదో బౌలర్ లేని లోటు సఫారీలను ఇబ్బంది పెడుతోంది. పార్ట్ టైమర్లు ఎవరు బౌలింగ్ చేసినా, ప్రత్యర్థులు చెలరేగి పరుగులు సాధించారు.
 
గ్రూప్ ‘బి'లో ఆరు లీగ్ మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి దక్షిణాఫ్రికా క్వార్టర్స్‌కు వచ్చింది.
 
లంక: టాపార్డర్ సూపర్
శ్రీలంక జట్టులోని ముగ్గురు టాపార్డర్ బ్యాట్స్‌మన్ కలిపి ఈ టోర్నీలో ఏకంగా 1152 పరుగులు నమోదు చేశారు. ఇది అన్ని జట్లలోకి అత్యుత్తమ ప్రదర్శన. కాబట్టి ఆ జట్టు విజయావకాశాలు  సంగక్కర, దిల్షాన్, తిరిమన్నెలపై ఆధారపడి ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా సంగక్కర నాలుగు వరుస సెంచరీలు సహా దాదాపు 500 పరుగులతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నాడు. అతను విఫలమైన మ్యాచ్ (అఫ్ఘాన్‌తో)లో లంక తడబడటం కూడా చూశాం. మరో సీనియర్ జయవర్ధనే స్థాయికి తగ్గ ఆటతీరు కనబర్చలేదు.

అయితే ప్రపంచకప్‌లో నాకౌట్ మ్యాచ్‌లలో అతని సగటు 81 పరుగులు ఉం డటం జయవర్ధనే ఎలాంటి స్థితిలోనైనా ఆడగలడనేదానికి నిదర్శనం. ఇక మిడిలార్డర్‌లో పెరీరా, మ్యాథ్యూస్ కీలకం కానున్నారు. ఈ టోర్నీలో లంక బౌలర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. మలింగ, కులశేఖర ఒక్కసారి కూడా తమ స్థాయి ప్రదర్శన ఇవ్వలేదు. స్పిన్‌లో ఆ జట్టు హెరాత్‌పై ఆధారపడుతుండగా, అతను గాయానికి గురి కావడం కాస్త ఆందోళన రేపుతోంది.
 
మొత్తం ఆరు లీగ్ మ్యాచ్‌లలో నాలుగు గెలిచి 8 పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ లో మూడో స్థానం ద్వారా శ్రీలంక క్వార్టర్స్‌కు చేరింది.
 
ఆమ్లా X మలింగ
డివిలియర్స్ మెరుపులకు తోడు ఆమ్లా నిలకడగా ఆడితేనే సఫారీలు గెలుపుపై నమ్మకం ఉంచుకోవచ్చు. చాన్నాళ్లుగా అతను చక్కటి ఫామ్‌తో జట్టుకు శుభారంభాలు ఇస్తున్నాడు. టోర్నీలో 11 వికెట్లు తీసిన మలింగ... ఆమ్లా దూకుడును అడ్డుకోవాలి. అతని వికెట్ తీస్తే జట్టుపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. తన యార్కర్లతో పరుగులు ఇవ్వకుండా నిరోధించగలిగినా... మలింగ విజయవంతమైనట్లే.
 
ప్రపంచకప్‌లో ఇరు జట్లు 4 మ్యాచ్‌లలో తలపడ్డాయి. 1992లో లంక గెలవగా...1999, 2007లలో దక్షిణాఫ్రికాదే పైచేయి అయింది. 2003లో జరిగిన మ్యాచ్ ‘టై’ అయింది. అయితే ఈ మ్యాచ్‌లో డక్‌వర్త్-లూయీస్ లెక్క తప్పిన దక్షిణాఫ్రికా సొంతగడ్డపై టోర్నీనుంచి నిష్ర్కమించింది.
 
గత ప్రపంచకప్ తర్వాత ఇరు జట్ల మధ్య 13 వన్డేలు జరగ్గా, శ్రీలంక 7, దక్షిణాఫ్రికా 6 నెగ్గాయి.
 
2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీ నుంచి వరుసగా ఆరు సార్లు దక్షిణాఫ్రికా నాకౌట్ దశలో ఓడింది.
 
శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 59 వన్డేలు జరిగాయి. వీటిలో శ్రీలంక 29, దక్షిణాఫ్రికా 28 గెలిచాయి. 1 మ్యాచ్ టై కాగా, మరోదాంట్లో ఫలితం రాలేదు.
 
మరొక్క స్టంపింగ్ చేస్తే సంగక్కర వన్డేల్లో 100 స్టంపౌట్‌లు చేసిన తొలి వికెట్ కీపర్ అవుతాడు.
 
పిచ్, వాతావరణం
మ్యాచ్ రోజు కాస్త వర్షం కురిసే అవకాశం ఉంది. అయితే ఓవర్లు తగ్గినా...మ్యాచ్ మాత్రం జరగొచ్చు. పిచ్ పొడిగా ఉంది. బ్యాటింగ్‌కు అనుకూలం. స్పిన్‌కు కూడా పెద్దగా సహకరించకపోవచ్చు.
 
‘మాపై ఉన్న ‘చోకర్స్' మచ్చను ఈ మ్యాచ్‌తో తొలగించుకుంటాం. మంచి క్రికెట్ ఆడి గెలవాలని పట్టుదలగా ఉన్నాం. లీగ్ దశలో రెండు మ్యాచ్‌లు ఓడినా మా జట్టు పటిష్టంగా ఉంది. నా బ్యాటింగ్‌పైనే ఆధారపడి ఉందనడం అర్థం లేనిది. మేం చేయాల్సిందల్లా గెలిచేందుకు తగిన మార్గం వెతకడమే’.     
 - డివిలియర్స్
 
‘రెండు జట్లపై ఒత్తిడి ఉండటం సహజం. చరిత్ర, గణాంకాలను పక్కన పెడితే దక్షిణాఫ్రికా మంచి జట్టు. కాబట్టి మేం చాలా బాగా ఆడాలి. డివిలియర్స్‌ను అడ్డుకోవడం కూడా మాకు కీలకం. 300పైగా ఛేదన అయినా ఈ పిచ్‌పై కష్టం కాదు’.         
- మ్యాథ్యూస్

మరిన్ని వార్తలు