ధోనీతో లావాదేవీల వివరాలు కోరిన సుప్రీం

30 Apr, 2019 13:47 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : క్రికెటర్‌ మహీంద్ర సింగ్‌ ధోనీతో జరిపిన అన్ని లావాదేవీల వివరాలను బుధవారంలోగా తమకు నివేదించాలని సుప్రీం కోర్టు మంగళవారం ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. ఆమ్రపాలి గ్రూప్‌ తనను మోసం చేసిందని ధోని సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయించారు. రాంచీలోని ఆమ్రపాలి సఫారిలో పెంట్‌హౌస్‌ను తాను బుక్‌ చేసుకున్నానని, ఇంతవరకూ పెంట్‌హౌస్‌ను తనకు అప్పగించలేదని పిటిషన్‌లో ధోని ఆరోపించారు. మరోవైపు కంపెనీ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించినందుకు తనకు చెల్లించాల్సిన బకాయిలను సైతం ఆమ్రపాలి గ్రూప్‌ చెల్లించలేదని ధోనీ కోర్టుకు నివేదించారు.

2006 నుంచి 2009 మధ్య కంపెనీని ప్రమోట్‌ చేసినందుకు తనకు రూ 40 కోట్లు రావాలని ధోని కోరుతున్నారు. కాగా ధోనీతో జరిగిన లావాదేవీల వివరాలను పూర్తిగా తమకు సమర్పించాలని సుప్రీం కోర్టు ఆమ్రపాలి గ్రూప్‌ను ఆదేశించింది. మరోవైపు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నఆమ్రపాలి గ్రూప్‌పై పెద్దసంఖ్యలో గృహాల కొనుగోలుదారులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము అడ్వాన్స్‌లు చెల్లించినా తమకు ఇస్తామన్న ఇళ్లను ఇంకా ఇవ్వలేదని పిటిషన్లలో పేర్కొన్నారు. కాగా గృహ కొనుగోలుదారులు చెల్లించిన డబ్బుతో నిర్మించిన ఫైవ్‌స్టార్‌ హోటల్‌, మాల్‌, కార్పొరేట్‌ కార్యాలయాలతో పాటు లగ్జరీ కార్లు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీని అటాచ్‌ చేసి వాటిని విక్రయించి బకాయిపడిన వారికి చెల్లింపులు చేపట్టాలని సుప్రీం కోర్టు ఇప్పటికే ఆదేశించింది.

మరిన్ని వార్తలు