3.4 ఓవర్లు.. 4 పరుగులు.. 5 వికెట్లు...

9 Mar, 2018 20:13 IST|Sakshi

దుబాయ్‌ : పదిహేడేళ్ల పాకిస్థాన్‌ కుర్రాడు షహీన్‌ అఫ్రిదీ పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. బంతితో మైదానంలో షహీన్‌ దుమ్ము రేగొట్టాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా కేవలం నాలుగు పరుగులు ఇచ్చి.. ఐదు వికెట్లు పడగొట్టాడు. తద్వారా టీ-20 ఫార్మట్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన కనబరిచిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు. 

శుక్రవారం లాహోర్‌ క్వాలాండర్స్‌, ముల్తాన్‌ సుల్తాన్స్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముల్తాన్‌ జట్టు ఒక దశలో 8 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 60 పరుగులు చేసింది. ఇక అక్కడ నుంచి షహీన్‌ బంతితో చెలరేగిపోయాడు. 3.4 ఓవర్లు వేసిన షహీన్‌ కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. 16వ ఓవర్లలో మూడు వికెట్లు దక్కించుకోవటం విశేషం. వెరసి సుల్తాన్‌ ముల్తాన్‌ జట్టును 114 పరుగులకే షహీన్‌ కట్టడి చేశాడు.

ఇక ఓవరాల్‌గా టీ20 ఫెర్మామెన్స్‌ గనుక గమనిస్తే... శ్రీలంక బౌలర్‌ హెరాత్‌ న్యూజిలాండ్‌పై, రషీద్‌ ఖాన్‌ ఐర్లాండ్‌పై, సోహైల్‌ తన్వీర్‌ ట్రిడెంట్స్‌ జట్టులపై 3 పరుగులిచ్చి ఐదేసి వికెట్లు పడగొట్టారు. ఈ లిస్ట్‌లో కుంబ్లేను (5 పరుగులు 5 వికెట్లు రాజస్థాన్‌ రాయల్స్‌ పై) కిందకి నెట్టి షహీన్‌ ఇప్పుడు నాలుగో స్థానంలో నిలిచాడు.

మరిన్ని వార్తలు