ఎంత ప్రయత్నించినా కష్టమే: శార్దూల్‌

23 Oct, 2018 13:38 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన టీమిండియా పేసర్‌ శార్దూల్‌ ఠాకూర్‌.. అదే మ్యాచ్‌లో చీలమండ గాయం తిరగబెట్టడంతో వన్డే సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. కాగా, వచ్చే నెల్లో ఆస్ట్రేలియాతో జరుగనున్న టీ20 సిరీస్‌కు కూడా దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. శార్దూల్‌కు దాదాపు ఏడు వారాలు విశ్రాంతి అవసరమని వైద్యులు తెలపడంతో అతను ఆసీస్‌తో జరిగే టీ20 సిరీస్‌తో పాటు తొలి రెండు టెస్టులకు అందుబాటులో ఉండకపోవచ్చనే  సంకేతాలిచ్చాడు.

ఆసీస్‌తో మూడు టీ20 సిరీస్‌ తర్వాత నాలుగు టెస్టుల సిరీస్‌ ఆరంభం కానుంది. తాజాగా తన ఫిట్‌నెస్‌పై మాట్లాడిన శార్దూల్‌.. ‘నేను ఎంత ప‍్రయత్నించినా ఆసీస్‌తో రెండో టెస్టు నాటికి ఫిట్‌కావడం కష్టమే. అందులోనూ టీ20లతో పాటు టెస్టుల్లో చోటు సంపాదించడం ప‍్రస్తుతం చాలా కష్టంగా మారింది. దాంతో నేను వన్డేలు నాటికి ఫిట్‌ కావడంపైనే దృష్టి సారించా. జట్టు పునరావాస శిబిరంలో నా తదుపరి శిక్షణను కంటిన్యూ చేస్తా.  ఏడువారాల్లో నేను ఎంతవరకూ ఫిట్‌ అవుతానో అనేది తెలియాలంటే అప్పటివరకూ వేచి చూడక తప్పదు’ అని శార్దూల్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో రెండో టెస్టులో ఈ యువబౌలర్‌ అంతర్జాతీయ టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. తొలి టెస్ట్‌ ఉత్సాహంతో బంతి అందుకున్న శార్థుల్‌ సరిగ్గా 10 బంతులు వేసాడో లేదో అతని చీలమండ గాయం తిరగబెట్టింది. ఈ నొప్పితో అతను విలవిలలాడాడు. చివరకు, కెప్టెన్‌ కోహ్లి, ఫిజియో సూచన మేరకు మైదానం వీడాడు. ఫలితంగా విండీస్‌తో వన్డే సిరీస్‌కు కూడా శార్దూల్‌ దూరం కావాల్సి వచ‍్చింది.

మరిన్ని వార్తలు