తలకు బంతి తగిలి కుప్పకూలిన షోయబ్ మాలిక్‌

17 Jan, 2018 12:59 IST|Sakshi

హామిల్టన్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఫీల్డర్ విసిరిన బంతి నేరుగా తలకు తగలడంతో పాకిస్తాన్‌ స్టార్ బ్యాట్స్‌మెన్ షోయబ్ మాలిక్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భారత టెన్నిస్ స్టార్‌ సానియా మీర్జా భర్త అయిన షోయబ్ మాలిక్.. 32వ ఓవర్ స్పిన్‌ బౌలింగ్ కావడంతో హెల్మెట్ లేకుండానే బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ సైడ్‌ షాట్ కొట్టి పరుగు కోసం ప్రయత్నించాడు. అయితే బంతి ఫీల్డర్ మన్రో చేతికి చిక్కడంతో అవతలి వైపు ఉన్న మహమ్మద్ హఫీజ్ రన్‌ వద్దని వారించాడు. దీంతో మాలిక్ వెనక్కి మళ్లాడు. ఈ క్రమంలో రనౌట్ చేసేందుకు ప్రయత్నించిన మన్రో బంతిని బలంగా వికెట్ల వైపు విసిరాడు. అది కాస్తా మాలిక్ తల వెనకవైపు బలంగా తాకింది. దీంతో విలవిల్లాడుతూ అక్కడే కుప్పకూలిపోయాడు. వైద్య సిబ్బంది అతడికి చికిత్స అందించడంతో కోలుకుని తిరిగి బ్యాటింగ్‌కు దిగాడు. అయితే మాలిక్ (6) వెంటనే పెవిలియన్ దారి పట్టాడు.

కాగా, పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో న్యూజిలాండ్‌ విజయం సాధించింది. గ్రాండ్‌హోమ్‌ (40 బంతుల్లో 74 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు మెరిపించి కివీస్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. ఫఖర్‌ జమాన్‌ (54; 7 ఫోర్లు, ఒక సిక్స్‌), హారీస్‌ సోహైల్‌ (50; 4 ఫోర్లు, ఒక సిక్స్‌), హఫీజ్‌ (81; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ అహ్మద్‌ (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో ఆకట్టుకున్నారు. అనంతరం న్యూజిలాండ్‌ 45.5 ఓవర్లలో 263 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. 154 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాలో పడిన కివీస్‌ను గ్రాండ్‌హోమ్, నికోల్స్‌ (52 నాటౌట్‌; 3 ఫోర్లు) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు అజేయంగా 109 పరుగులు జోడించి కివీస్‌ విజయాన్ని ఖాయం చేశారు. సిరీస్‌లో చివరిదైన ఐదో వన్డే ఈనెల 19న జరుగుతుంది.

మరిన్ని వార్తలు