స్వర్ణంతో సమాప్తం

28 Feb, 2019 01:07 IST|Sakshi

చివరి రోజు భారత్‌ ఖాతాలో మూడో పసిడి పతకం

10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన సౌరభ్‌–మను జంట

న్యూఢిల్లీ: వరుసగా రెండు రోజుల వైఫల్యం తర్వాత ప్రపంచ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌ చివరి రోజు భారత షూటర్లు మెరిశారు. 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌధరీ–మను భాకర్‌ జంట పసిడి పతకం గెల్చుకుంది. దాంతో ఈ మెగా ఈవెంట్‌ను భారత్‌ స్వర్ణంతో ముగించింది. ఓవరాల్‌గా హంగేరి, భారత్‌ మూడు స్వర్ణాల చొప్పున సాధించి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలువడం విశేషం. భారత షూటర్లు రెండు కొత్త ప్రపంచ రికార్డులు  నెలకొల్పడంతోపాటు ఒక ఒలింపిక్‌ బెర్త్‌ను దక్కించుకున్నారు.  టోర్నమెంట్‌ ఆఖరి రోజు బుధవారం 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌధరీ–మను భాకర్‌ జంట 483.4 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.

రాన్‌జిన్‌ జియాన్‌–బోవెన్‌ జాంగ్‌ (చైనా–477.7 పాయింట్లు) జోడీ రజతం... మిన్‌జుంగ్‌ కిమ్‌–డేహన్‌ పార్క్‌ (కొరియా–418.8 పాయింట్లు) ద్వయం కాంస్యం సొంతం చేసుకున్నాయి. 39 జోడీలు పాల్గొన్న క్వాలిఫయింగ్‌లో సౌరభ్‌–మను జోడీ 778 పాయింట్లు స్కోరు చేసి ప్రపంచ రికార్డును సమం చేయడంతోపాటు అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరింది. టాప్‌–5 జోడీలు ఫైనల్లోకి ప్రవేశించాయి. అంతకుముందు జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో రవి కుమార్‌–అంజుమ్‌ మౌద్గిల్‌ (భారత్‌) జంట క్వాలిఫయింగ్‌లో 836.3 పాయింట్లు స్కోరు చేసి ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. 
 

మరిన్ని వార్తలు