కోహ్లిపై అంత పరుషమైన విమర్శలా..!

24 Jan, 2018 09:40 IST|Sakshi

దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయి.. విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి మరోసారి మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ అండగా నిలిచారు. కోహ్లిపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రెహం స్మిత్‌ చేసిన విమర్శలను గంగూలీ తోసిపుచ్చారు. స్మిత్‌ చేసిన విమర్శలు చాలా పరుషంగా ఉన్నాయని అన్నారు.

స్వదేశంలో, ఉపఖండంలో వరుసగా తొమ్మిది టెస్ట్‌ సిరీస్‌ విజయాలు భారత్‌కు అందించిన కోహ్లి.. దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం ఆ విజయపరంపరను కొనసాగించలేకపోయాడు. కేప్‌టౌన్‌, సెంచూరియన్‌లలో జరిగిన టెస్టుల్లో కోహ్లి టీమ్‌ సెలక్షన్‌, వ్యూహాత్మక నిర్ణయాలు పలు ప్రశ్నలకు తావిచ్చాయి.

విదేశాల్లో ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో మంచి రికార్డు ఉన్న అజింక్యా రహానేను బెంచికే పరిమితం చేయడం, టీమిండియా బెస్ట్‌ బౌలర్‌ అయిన భువనేశ్వర్‌ను రెండో టెస్టుకు కోహ్లి తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. రెండో టెస్టు అనంతరం ఈ విషయమై మీడియా అడిగిన కఠినమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక కోహ్లి అసహనానికి లోనై.. చిర్రుబుర్రులాడాడు.

ఈ నేపథ్యంలో స్మిత్‌ స్పందిస్తూ.. టీమిండియాకు దీర్ఘకాలిక కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లి సరైన ఆప్షన్‌ కాదని పేర్కొన్నాడు. కోహ్లికి వ్యూహాత్మక సామర్థ్యాలు ఉన్నప్పటికీ.. జట్టు నుంచి నిర్మాణాత్మక సలహాలు తీసుకొని.. అందరినీ కలుపుకొని ముందుకునడిచే వాతావరణం కల్పిస్తేనే మంచి నాయకుడిగా ఎదుగుతాడని స్మిత్‌ చెప్పుకొచ్చాడు. స్మిత్‌ వ్యాఖ్యలతో గంగూలీ విభేదించారు.

‘స్మిత్‌ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. విరాట్‌ యువసారథి. కెప్టెన్‌గా అతనికిది తొలి పూర్తిస్థాయి విదేశీ పర్యటన. ఇంత పరుషమైన ప్రకటన చేయడం సరికాదు. విరాట్‌ మంచి వ్యక్తి. కొన్ని నెలల్లో ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా పర్యటనలు ఉన్నాయి. అక్కడ అతను నేర్చుకుంటారు. స్మిత్‌ గొప్ప కెప్టెనే కానీ, కోహ్లిపై అతని అభిప్రాయాలతో ఏకీభవించడం లేదు’ అని గంగూలీ పేర్కొన్నారు. అదే సమయంలో రహనేను పక్కనబెట్టాలన్న కోహ్లి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయంపై గంగూలీ విస్మయం వ్యక్తం చేశారు. విదేశీ టెస్టులకు రహానే తప్పనిసరి అని సూచించారు.
 

మరిన్ని వార్తలు