వాండరర్స్‌లో వండర్‌ వన్డే

12 May, 2020 02:52 IST|Sakshi

ఆస్ట్రేలియా 434/4, దక్షిణాఫ్రికా 438/9

ఛేదనలో సఫారీల ప్రపంచ రికార్డు

క్రికెట్‌ చరిత్రలో నిలిచిపోయిన అద్భుత మ్యాచ్‌

పాంటింగ్, గిబ్స్‌ మెరుపు సెంచరీలు

వన్డేల్లో పరుగుల విధ్వంసం అంటే ఏమిటో ఆ మ్యాచ్‌ చూపించింది. ఒకరితో మరొకరు పోటీ పడి పరుగుల వరద పారించడం అంటే ఎలా ఉంటుందో వాండరర్స్‌ మైదానంలో కనిపించింది. రెండు అగ్రశ్రేణి జట్లు కొదమ సింహాల్లా భీకరంగా తలపడుతుంటే అటు మైదానంలో, ఇటు టీవీల్లో ప్రేక్షకులు కన్నార్పకుండా చూశారు. అప్పటికి ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆస్ట్రేలియా 434  పరుగులు నమోదు చేసి సవాల్‌ విసిరితే మరో జట్టయితే మైదానంలో దిగక ముందే చేతులెత్తేసేదేమో. కానీ దక్షిణాఫ్రికా అలా చేయలేదు. విజయం కోసం తుదికంటా పోరాడింది. ఒక వికెట్‌ చేతిలో, ఒక బంతి మిగిలి ఉండగా లక్ష్యం చేరి గర్జించింది. మొత్తంగా వన్డే క్రికెట్‌ చరిత్రలో అత్యద్భుతమైన మ్యాచ్‌గా ఆ పోరు నిలిచిపోయింది.

మార్చి 12, 2006, జొహన్నెస్‌బర్గ్‌... టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ (44 బంతుల్లో 55; 9 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడగా ఆడగా, మరో ఓపెనర్‌ సైమన్‌ కటిచ్‌ (90 బంతుల్లో 79; 9 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు. వీరిద్దరు 15.2 ఓవర్లలో 97 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ (105 బంతుల్లో 164; 13 ఫోర్లు, 9 సిక్సర్లు) బరిలోకి దిగి ఒక్కసారిగా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాడు. 2003లో ఇదే మైదానంలో భారత్‌పై ప్రపంచకప్‌ ఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను గుర్తు చేస్తూ మెరుపు బ్యాటింగ్‌ ప్రదర్శించాడు. ఏ ఒక్క బౌలర్‌నూ వదిలిపెట్టకుండా మైదానం నలుమూలలా షాట్లు బాదాడు. 71 బంతుల్లో అతని సెంచరీ పూర్తయింది. తర్వాత వచ్చిన మైక్‌ హస్సీ (51 బంతుల్లో 81; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోవడంతో ఆసీస్‌ భారీ స్కోరు సాధించింది. 39.5 ఓవర్లలో ఆసీస్‌ స్కోరు 300 పరుగులు దాటగా, 47 ఓవర్లలో ఆ జట్టు 400 పరుగుల మైలురాయిని అధిగమించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆస్ట్రేలియా 4 వికెట్లకు 434 పరుగులు చేసింది.

స్మిత్‌ దూకుడు... 
అసాధ్యంగా కనిపించిన ఛేదనలో దక్షిణాఫ్రికా రెండో ఓవర్లోనే డిపెనార్‌ (1) వికెట్‌ కోల్పోయింది. అయితే హెర్షల్‌ గిబ్స్‌ (111 బంతుల్లో 175; 21 ఫోర్లు, 7 సిక్సర్లు) వీర బాదుడుతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మరోవైపు తన స్వభావానికి విరుద్ధంగా కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ (55 బంతుల్లో 90; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. 79 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న గిబ్స్‌ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడాడు. అతను అవుటయ్యే సమయానికి సఫారీలు 18.1 ఓవర్లలో మరో 136 పరుగులు చేయాల్సి ఉండటంతో కష్టంగా అనిపించింది. కలిస్‌ (20), డివిలియర్స్‌ (14) కూడా విఫలమయ్యారు. అయితే లోయర్‌ ఆర్డర్‌లో వాండర్‌వాత్‌ (18 బంతుల్లో 35; ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌... మరోవైపు వికెట్‌ కీపర్‌ మార్క్‌ బౌచర్‌ (43 బంతుల్లో 50 నాటౌట్‌; 4 ఫోర్లు) పట్టుదలగా నిలబడి జట్టును విజయంవైపు నడిపించాడు.

దక్షిణాఫ్రికా విజయానికి చివరి 5 ఓవర్లలో 47 పరుగులు కావాల్సి ఉండగా... ఆ జట్టు 4 ఓవర్లలో 40 పరుగులు చేసింది. బ్రెట్‌లీ వేసిన చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా... తొలి 3 బంతుల్లో 5 పరుగులు వచ్చాయికానీ 9వ వికెట్‌ కూడా పడింది. తీవ్ర ఒత్తిడిలో నాలుగో బంతికి ఎన్తిని సింగిల్‌ తీయగా, ఐదో బంతికి ఫోర్‌ కొట్టి బౌచర్‌ మ్యాచ్‌ ముగించాడు. దాంతో దక్షిణాఫ్రికా 49.5  ఓవర్లలో 9 వికెట్లకు 438 పరుగులు చేసి గెలిచింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3–2తో సొంతం చేసుకుంది. బౌచర్‌ విక్టరీ షాట్‌ తర్వాత సఫారీ శిబిరంలో సంబరాలకు అంతు లేకుండా పోయింది. అయితే ఆసీస్‌ ఆటగాళ్లు కూడా పెద్దగా నిరాశ చెందలేదు. చరిత్రకెక్కిన ఒక మ్యాచ్‌లో భాగమైనందుకు ఆటగాళ్లందరూ గర్వించారు.

► వన్డేల్లో ఒక జట్టు 400కు పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి.  
► వన్డేల్లో అత్యధిక పరుగుల ఛేదన రికార్డు... ఒకే వన్డేలో అత్యధిక పరుగులు (872) నమోదైన రికార్డు ఈ మ్యాచ్‌ పేరిటే ఉన్నాయి. 
► గిబ్స్‌ 175 పరుగులు చేసి 31.5వ ఓవర్లో అవుటయ్యాడు. అప్పుడే డబుల్‌ సెంచరీకి అవకాశం కనిపించింది కానీ సాధ్యం కాలేదు.  
► మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్‌ మిక్‌ లూయిస్‌ 10 ఓవర్లలో 113 పరుగులు ఇవ్వడం ఇప్పటికీ వన్డేల్లో అతి చెత్త రికార్డుగా నమోదై ఉంది. ఈ మ్యాచ్‌ తర్వాత లూయిస్‌ మళ్లీ ఆసీస్‌కు ఆడలేకపోయాడు.  
► దక్షిణాఫ్రికా బౌలర్‌ టెలిమాకస్‌ ఒక ఓవర్లో వరుసగా నాలుగు నోబాల్స్‌ వేశాడు. మ్యాచ్‌లో ఓవరాల్‌గా 87 పరుగులు ఇచ్చిన అతను ఇంత జోరులోనూ  ఒక ఓవర్‌ మెయిడిన్‌గా వేయడం విశేషం.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు