ఈ సిరీస్‌ నుంచి..ఆ సిరీస్‌!

13 Nov, 2018 00:07 IST|Sakshi

వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ముగిసిందనుకునేలోపే... పది రోజుల వ్యవధితో మరో సిరీస్‌. అదీ ఆస్ట్రేలియా గడ్డపై! ఒక విధంగా ఇది ఆ దేశంలో సుదీర్ఘ పర్యటనకు విజయ కాంక్ష పెంపొందించే ఇంధనంలా పనికొచ్చేదే! జయాపజయాల గణాంకాలు కూడా మన వైపే ఉన్నందున కావాల్సినంత ఆత్మవిశ్వాసం ఇచ్చేదే! మరి టీమిండియా దీనిని ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటుంది? తాజాగా విండీస్‌తో ముగిసిన సిరీస్‌ను ‘సన్నాహకంగా’ పరిగణిస్తూ... పొట్టి ఫార్మాట్‌లో కంగారూలను కంగుతినిపించాలంటే చేయాల్సిందేమిటి? సరిదిద్దుకోవాల్సిన లోపాలేమిటి?  

సాక్షి క్రీడా విభాగం: అనుకున్నంత తేలిగ్గా ఏమీ సాగలేదు విండీస్‌తో టి20 సిరీస్‌. మొదటి, మూడో మ్యాచ్‌లో టీమిండియా విజయానికి చెమటోడ్చాల్సి వచ్చింది. విరాట్‌ కోహ్లి గైర్హాజరీలో బ్యాటింగ్‌ భారం పూర్తిగా రోహిత్‌ శర్మ పైన పడగా, బుమ్రా విశ్రాంతి నేపథ్యంలో బాధ్యత తీసుకోవాల్సిన భువనేశ్వర్‌... లయ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. చైనామన్‌ కుల్దీప్‌ యాదవ్‌ స్పిన్‌ మంత్రం, యువ పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ మెరుపులు లేకుంటే మరిన్ని కష్టాలు ఎదురయ్యేవి. తద్వారా బ్యాటింగ్, బౌలింగ్‌ రెండింట్లోనూ సరిదిద్దాల్సిన అంశాలున్నాయని స్పష్టమైంది. మరీ ముఖ్యంగా ‘ఫినిషింగ్‌’ ఎంత కీలకమో తెలిసొచ్చింది. గెలుపు కారణంగా ఇవన్నీ పెద్దగా కనిపించడం లేదు కానీ, ఓడి ఉంటే తప్పకుండా చర్చకు వచ్చేవి. ఆస్ట్రేలియాలో అధిగమించాల్సిన సమస్యలివి. మరోవైపు ఈసారి పర్యటనలో ముందుగా టి20 సిరీస్‌ నిర్వహిస్తుండటం మన జట్టుకు మేలు చేయనుంది. అసలే బలహీనంగా ఉన్న కంగారూలను పొట్టి ఫార్మాట్‌లో దెబ్బకొట్టి మానసికంగా పైచేయి సాధించవచ్చు. తద్వారా టెస్టు సిరీస్‌ నెగ్గేందుకు    మార్గం వేసుకోవచ్చు. 

బ్యాటింగ్‌ కిం కర్తవ్యం? 
పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల్లో భారత బ్యాటింగ్‌ భారాన్ని మోస్తున్నది రోహిత్, ధావన్, కోహ్లి త్రయం! అయితే, వీరిలో ధావన్‌ను అంతగా నమ్మలేని పరిస్థితి. ఒక సిరీస్‌ బాగా ఆడితే మరో దాంట్లో చేతులెత్తేస్తున్నాడు. స్వదేశంలో వెస్టిండీస్‌తో వన్డే, టి20 సిరీస్‌ల్లో 8 మ్యాచ్‌లకు అతడు చేసింది ఒకటే అర్ధశతకం. అదీ చివరి మ్యాచ్‌లో. విజయానికి పరుగు దూరంలో, తీవ్ర ఒత్తిడి సమయంలో వికెట్‌ ఇచ్చేసి దానికీ సార్థకత లేకుండా చేసుకున్నాడు. ధావన్‌ ఫామ్‌ అందుకోవడం సంతోషకరమని ఆదివారం మ్యాచ్‌ ముగిశాక రోహిత్‌ శర్మ పేర్కొనడమే జట్టు బ్యాటింగ్‌ పరిమితులను చెబుతోంది. ఆసీస్‌ సిరీస్‌కు కోహ్లి వస్తున్నాడు కాబట్టి... 4, 5 స్థానాల సంగతే తేల్చుకోవాల్సి ఉంది. మనీశ్‌ పాండే కంటే కేఎల్‌ రాహులే ఉత్తమమని స్పష్టమైనందున అతడికే అవకాశాలిస్తే సరిపోతుంది. ధోనికి ప్రత్యామ్నాయంగా రిషభ్‌ పంత్‌ను తీసుకున్నామంటూనే, దినేశ్‌ కార్తీక్‌తో కీపింగ్‌ చేయించారు. ఫీల్డర్‌గా పంత్‌ ఏమంత సౌకర్యంగా లేడు. వీరిద్దరిలో వికెట్ల వెనుక ఉండేది ఎవరో ఖరారు చేసుకోవాలి. 


భువీకేమైంది? 

ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ పూర్తిగా కోలుకున్నాడా? లేదా? అనే అనుమానం ఇంకా వెంటాడుతూనే ఉంది. తప్పనిసరి అయి విశ్రాంతిని మాన్పించి వన్డే సిరీస్‌ మధ్యలో తీసుకొచ్చినా అతడు ఫిట్‌గా కనిపించలేదు. పరుగులు ధారాళంగా ఇచ్చాడు. డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌ ఆ మ్యాజిక్‌ను స్వదేశంలో అలవాటైన పిచ్‌లపై చూపలేకపోయాడు. కొంత తడబడినా కుర్రాడు ఖలీల్‌ మెరుగనిపించాడు. దీన్నిబట్టి చూస్తే బుమ్రానే ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. అటు వన్డే, ఇటు టి20ల్లో బుమ్రా కట్టడి చేశాడు. కుల్దీప్‌ స్పిన్‌ బలమే అనుకున్నా, గతంలో ఆడిన బ్రాడ్‌ హాగ్‌ కారణంగా చైనామన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొనడంలో ఆస్ట్రేలియన్లు అవగాహనతో ఉండొచ్చు. మరి ఈ సవాల్‌ను కుల్దీప్‌ ఎలా ఛేదిస్తాడో చూడాలి. మొత్తమ్మీద భువీ మునుపటిలా స్వింగ్‌ అందుకుంటే ఆసీస్‌ను సులువుగానే ఓడించవచ్చు. 

ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఆటగాళ్లు ముఖ్యంగా ధావన్‌ ఫామ్‌లోకి రావడం మంచి పరిణామం. అతడు వన్డే సిరీస్‌లో ప్రారంభాలను భారీ స్కోర్లుగా మలుచుకోలేకపోయాడు. పంత్‌ పరుగులు చేయాలన్న కసితో ఉన్నాడు. జట్టుకు, ఆటగాళ్లకు పరీక్ష పెట్టే ఆసీస్‌ పర్యటన భిన్నమైన సవాల్‌తో కూడుకున్నది. విండీస్‌పై సిరీస్‌ గెలవడం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ ప్రదర్శనను మేం పునరావృతం చేయాల్సి ఉంది.
  – రోహిత్‌ శర్మ,  భారత తాత్కాలిక కెప్టెన్‌  


►ఇప్పటివరకు ఆస్ట్రేలియాతో భారత్‌ ఆడిన టి20 మ్యాచ్‌లు. వీటిలో 10 గెలిచింది.  ఐదింటిలో ఓడింది. 

►మొత్తం 15 మ్యాచ్‌ల్లో భారత్‌కు ధోని (13),  కోహ్లి (2) మాత్రమే  కెప్టెన్లుగా ఉన్నారు. ఇదే సమయంలో ఆసీస్‌కు ఏడుగురు సారథులు మారారు.  

>
మరిన్ని వార్తలు