ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా కలవలేదు.. సల్మాన్‌ నా ఫేవరెట్‌: గంగూలీ

5 Dec, 2023 21:23 IST|Sakshi
సౌరవ్‌ గంగూలీ- సల్మాన్‌ ఖాన్‌ (PC: X)

టీమిండియా మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు స్వాగతం పలికాడు. సల్మాన్‌ తన అభిమాన నటుడన్న దాదా.. ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆయనను కలవలేకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నాడు. 

ఏదేమైనా కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ సందర్భంగా సల్లూ భయ్యాను కలుసుకోవడం సంతోషంగా ఉందని గంగూలీ హర్షం వ్యక్తం చేశాడు. కాగా కోల్‌కతా వేదికగా అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి మంగళవారం తెరలేచింది.

పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు క్రికెట్‌ దిగ్గజం సౌరవ్‌ గంగూలీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిలిం ఫెస్టివల్‌ సందర్భంగా కోల్‌కతాకు విచ్చేసిన బాలీవుడ్‌ స్టార్లు సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, మహేశ్‌ భట్‌, శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా తదితరులకు ఘన స్వాగతం లభించింది.

ఈ నేపథ్యంలో వేదికపైకి వచ్చిన సౌరవ్‌ గంగూలీ సల్మాన్‌ ఖాన్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘నా అభిమాన నటుడు మిస్టర్‌ సల్మాన్‌ ఖాన్‌కు కోల్‌కతా తరఫున స్వాగతం. వ్యక్తిగతంగా మిమ్మల్ని కలవడం ఇదే తొలిసారి. 

ఇన్నేళ్లుగా మిమ్మల్ని ఒక్కసారి కూడా ప్రతక్ష్యంగా కలుసుకోలేకపోయాను.  ఒకరకంగా చెప్పాలంటే నిజంగా ఇది దురదృష్టకరమే. అయితే, ఇప్పుడు ఆ లోటు తీరింది’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. బాలీవుడ్‌ స్టార్లతో పాటు సీఎం మమతా బెనర్జీ, సౌరవ్‌ గంగూలీ స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా బెంగాల్‌ తరఫున టీమిండియాకు ఆడిన సౌరవ్‌ గంగూలీ దూకుడైన కెప్టెన్‌గా పేరొందిన విషయం తెలిసిందే. గతంలో బీసీసీఐ అధ్యక్షుడిగానూ తన మార్కు చూపించాడీ బెంగాలీ బ్యాటర్‌.

చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌.. సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

>
మరిన్ని వార్తలు