T20 WC: యువ సంచలనం.. కేకేఆర్‌ డైనమైట్‌.. వరల్డ్‌కప్‌ జట్టులో చోటు ఖాయం! పేరు తెలుసు కదా!

5 Dec, 2023 19:40 IST|Sakshi

రింకూ సింగ్‌.. టీమిండియా యువ సంచలనం.. ఇప్పటివరకు 10 అంతర్జాతీయ టీ20లలో భాగమయ్యాడు.. బ్యాటింగ్‌ చేసింది కేవలం ఆరుసార్లే.. అయితేనేం తనదైన ముద్రవేయగలిగాడు.

ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి తన వంతు పాత్ర చక్కగా పోషిస్తూ ‘నయా ఫినిషర్‌’గా పేరు తెచ్చుకుంటున్నాడు. మహేంద్ర సింగ్‌ ధోని వారసుడిగా ప్రశంసలు అందుకుంటున్నాడు 26 ఏళ్ల ఈ లెఫ్టాండ్‌ బ్యాటర్‌.

ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడే రింకూ సింగ్‌ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 187.5 స్ట్రైక్‌రేటుతో సగటు 60తో 180 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక స్కోరు 46. ఒత్తిడిలోనూ దూకుడుగా ఆడగలగడం రింకూ బలం.

మిగతా ఆటగాళ్ల కంటే ఈ లక్షణమే ఈ యూపీ బ్యాటర్‌ను ప్రత్యేకంగా నిలుపుతోంది. భవిష్యత్తులో జట్టుకు ఉపయోగపడతాడనే నమ్మకాన్ని సెలక్టర్లకు ఇస్తోంది. అందుకే పొట్టి ఫార్మాట్లో సత్తా చాటిన రింకూకు వన్డేల్లోనూ మార్గం చేసేందుకు మేనేజ్‌మెంట్‌ సిద్ధమవుతోంది.

ఐర్లాండ్‌తో సిరీస్‌ సందర్భంగా అరంగేట్రం
ఈ ఏడాది ఆగష్టులో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన రింకూ సింగ్‌.. టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లోనూ తనను తాను నిరూపించుకుంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టులో అతడి స్థానం పదిలమవుతుంది.

రింకూ ఆట తీరు చూస్తే అదే ఇదేమీ అతడికి కష్టం కాబోదంటున్నారు విశ్లేషకులు. అయితే, దక్షిణాఫ్రికా టూర్‌ రూపంలో రింకూకు అతిపెద్ద సవాల్‌ ఎదురుకాబోతోంది. టీ20, వన్డే జట్లలో భాగమైన అతడు.. పేస్‌కు అనుకూలించే సఫారీ పిచ్‌లపై ఎలా రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

సఫారీ గడ్డపై అసలైన సవాలు
ఒకవేళ ఇక్కడ గనుక రింకూ హిట్‌ అయితే.. జట్టు సెలక్షన్‌ సమయంలో మిగతా యువ ఆటగాళ్ల కంటే అతడి పేరు కచ్చితంగా ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. ఇక క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కీలకమైన ఐదు- ఆరు స్థానాల్లో గనుక రాణిస్తే కొన్నేళ్ల పాటు టీమిండియాలో కొనసాగగలడు. ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్యాలకు బ్యాకప్‌ ఫినిషర్‌గా పనిచేయగలడు.

కేకేఆర్‌ ఇచ్చిన డైనమైట్‌
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ తరఫున అద్భుత ప్రదర్శనతో రింకూ సింగ్‌ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. వన్డేలలో భవిష్యత్తు  గురించి పక్కనపెడితే.. పొట్టి ఫార్మాట్లో మాత్రం రింకూ దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌-2024లో చోటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు.

ఈ మెగా టోర్నీకి ముందు సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్‌లతో టీమిండియా మూడేసి టీ20లు ఆడనుంది. ఈ రెండు సిరీస్‌లలో గనుక సత్తా చాటితే వరల్డ్‌కప్‌ కోసం అతడి టికెట్‌ ఖరారైనట్లే భావించవచ్చంటున్నారు విశ్లేషకులు.

వరల్డ్‌కప్‌-2024 జట్టులో చోటు ఖాయం
ఇక టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా సైతం.. ‘‘ప్రస్తుతం లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌లో టీమిండియా తరఫున అద్భుతంగా ఆడుతున్న వాళ్లు కొంతమందే ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో రింకూకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు.  నిజానికి రింకూ గొప్పగా ఆడగలడు.

మంచి ఫినిషర్‌ కూడా! కచ్చితంగా అతడు వరల్డ్‌కప్‌ జట్టు సన్నాహకాల్లో భాగంగా మేనేజ్‌మెంట్‌ దృష్టిలో ఉంటాడు. ఎడమచేతి వాటం గల బ్యాటర్‌ కావడం అదనపు అర్హత.  ప్రపంచకప్‌ లాంటి మెగా ఈవెంట్లలో ఇలాంటి బ్యాటర్ల అవసరం ఎంతగానో ఉంటుంది. అతడు కచ్చితంగా ప్రపంచకప్‌-2024లో చోటు దక్కించుకుంటాడు’’ అని అంచనా వేశాడు.  

చదవండి: సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌.. సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

>
మరిన్ని వార్తలు