Ind vs SA: వన్డేలో సెంచరీతో చెలరేగిన సంజూ శాంసన్‌.. సెలక్టర్లకు స్ట్రాంగ్‌ మెసేజ్‌!

5 Dec, 2023 18:02 IST|Sakshi

Vijay Hazare Trophy 2023 - Kerala vs Railways: విజయ్‌ హజారే ట్రోఫీ-2023లో కేరళ బ్యాటర్‌ సంజూ శాంసన్‌ అద్భుత సెంచరీతో మెరిశాడు. బెంగళూరు వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 128 పరుగులు సాధించాడు. తద్వారా సౌతాఫ్రికాతో సిరీస్‌ ఆరంభానికి ముందు టీమిండియా సెలక్టర్లకు తన ఫామ్‌ గురించి గట్టి సందేశం పంపాడు.

కాగా ఆసియా వన్డే కప్‌-2023, వన్డే వరల్డ్‌కప్‌-2023 జట్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఐసీసీ టోర్నీకి సంజూను కాదని.. ముంబై బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ.

వన్డేల్లో మంచి రికార్డు ఉన్నా సంజూను పక్కన పెట్టి టీ20 స్టార్‌ సూర్యకు పెద్దపీట వేసి ఫలితం అనుభవించింది. ఈ నేపథ్యంలో సంజూకు మద్దతుగా అభిమానులతో పాటు పలువురు మాజీ క్రికెటర్లు కూడా గళమెత్తారు.

ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా వన్డే జట్టులో సంజూ శాంసన్‌కు స్థానమిచ్చారు సెలక్టర్లు. అయితే, ఈ జట్టుకు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌ కావడంతో.. సంజూకు తుదిజట్టులో చోటు దక్కడం అనుమానమే!

ఈ నేపథ్యంలో దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో రైల్వేస్‌తో మ్యాచ్‌లో అతడు సెంచరీ బాదడం హైలైట్‌గా నిలిచింది. బెంగళూరులో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసింది కేరళ. రైల్వేస్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సహాబ్‌ యువరాజ్‌ అజేయ శతకం(121)తో మెరవగా.. నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది.

అయితే, లక్ష్య ఛేదనలో ఆరంభంలోనే కేరళ తడబడింది. ఓపెనర్‌ రోహన్‌ కన్నుమ్మల్‌ డకౌట్‌ కాగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ సచిన్‌ బేబి 9, ఆ తర్వాతి స్థానంలో వచ్చిన సల్మాన్‌ నిజార్‌ 2 పరుగులకే పెవిలియన్‌ చేరారు.

ఈ క్రమంలో మరో ఓపెనర్‌ క్రిష్ణ ప్రసాద్‌(29)తో కలిసి కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దాడు. మొత్తం 139 బంతులు ఎదుర్కొన్న సంజూ ఎనిమిది ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 128 పరుగులు సాధించాడు. శ్రేయస్‌ గోపాల్‌ సైతం అర్ధ శతకం(53)తో రాణించాడు.

కానీ మిగతా బ్యాటర్ల నుంచి సహకారం లేకపోవడంతో కేరళకు రైల్వేస్‌ చేతిలో 18 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు. రైల్వేస్‌ బౌలర్లలో రైటార్మ్‌ పేసర్‌ రాహుల్‌ శర్మ అత్యధికంగా నాలుగు వికెట్లు తీశాడు. సంజూ రూపంలో కీలక వికెట్‌ పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికా టూర్‌కు ముందు సంజూ శాంసన్‌ సెంచరీ చేయడం పట్ల అభిమానులు ఖుషీ అవుతున్నారు. సఫారీ గడ్డపై ఆడే అవకాశం ఈ కేరళ బ్యాటర్‌కు కల్పించాలంటూ సెలక్టర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో సత్తా చాటినా సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌ ఆడే జట్టుకు మాత్రం సంజూను ఎంపిక చేయలేదు.

చదవండి: Test Captain: రోహిత్‌ తర్వాత టీమిండియా టెస్టు కెప్టెన్‌ అతడే! గిల్‌కు కూడా ఛాన్స్‌!

>
మరిన్ని వార్తలు