క్రికెట్‌ ఆడే సత్తా ఇంకా ఉంది: శ్రీశాంత్‌

15 Mar, 2019 18:11 IST|Sakshi

న్యూఢిల్లీ :  ‘42 ఏళ్ల వయసులో లియాండ్‌ పేస్‌ గ్రాండ్‌ స్లామ్‌ గెలిచాడు. 36 ఏళ్ల వయసులో కనీసం కొంతవరకైనా మంచి క్రికెట్‌ ఆడలేనా’అంటూ క్రికెటర్‌ శ్రీశాంత్‌ ప్రశ్నించాడు. అతడిపై విధించిన జీవితకాల నిషేధాన్ని ఎత్తి వేయాలంటూ భారత క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డ్‌(బీసీసీఐ)ను సుప్రీం కోర్టు ఆదేశించడంతో శ్రీశాంత్‌ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అతడు.. క్రికెట్‌ ఆడే సత్తా తనలో ఇంకా ఉందన్నాడు. వయసు అసలు సమస్యే కాదన్న శ్రీశాంత్‌.. ఫిట్‌గా ఉన్నంత కాలం క్రికెట్‌ ఆడొచ్చన్నాడు. ఈ ఆరు సంవత్సరాలు తన జీవితంలో చీకటి రోజులుగా మిగిలిపోతాయన్నాడు. తాను నిర్దోషినని తెలిసి కూడా బీసీసీఐ నిషేధం విధించిందన్నాడు. ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును బీసీసీఐ గౌరవిస్తుందని భావిస్తున్నానని శ్రీశాంత్‌ చెప్పుకొచ్చాడు.
(శ్రీశాంత్‌కు భారీ ఊరట)
వాళ్లు టచ్‌లో ఉన్నారు..
తనపై నిషేధం విధించడంతో కనీసం క్లబ్‌ క్రికెట్‌ కూడా ఆడలేకపోయానని శ్రీశాంత్‌ వాపోయాడు. కౌంటీ క్రికెట్‌ ఆడటానికి కూడా బీసీసీఐ అనుమతి నిరాకరించిందని గుర్తుచేశాడు. క్రికెట్‌ ఆడకున్నా తన సహచర క్రికెటర్లతో సంబంధాలు తెగిపోలేదని వివరించాడు. హర్భజన్‌ సింగ్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, రాబిన్‌ ఊతప్ప, రైనాలతో టచ్‌లో ఉన్నట్లు తెలిపాడు. ఈ గడ్డుకాలంలో తనకు తోడుగా నిలిచిన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, లాయర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక టీమిండియా గెలిచిన 2007, 2011 ప్రపంచకప్‌లలో శ్రీశాంత్‌ సభ్యుడన్న విషయం తెలిసిందే. టీమిండియా తరుపున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20లకు శ్రీశాంత్‌ ప్రాతినిథ్యం వహించాడు.
(పోలీస్‌ టార్చర్‌ భరించలేకే ఒప్పుకున్నా: శ్రీశాంత్)
అసలేం జరిగిందంటే..
2013లో జరిగిన ఐపీఎల్‌–6 సీజన్‌లో శ్రీశాంత్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలతో అరెస్ట్‌ అయ్యాడు. అయితే 2015 జూలైలో అతడిపై ఉన్న అభియోగాలను కొట్టివేస్తూ పటియాలా హౌస్‌ కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఆ తర్వాత స్థానిక టోర్నీల్లో ఆడేందుకు శ్రీశాంత్‌ ప్రయత్నించినా బీసీసీఐ మాత్రం తాము విధించిన నిషేధాన్ని అలాగే కొనసాగిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కేరళ హైకోర్టును శ్రీశాంత్ ఆశ్రయించాడు. 2017 ఆగస్టులో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కేరళ సింగిల్‌ బెంచ్‌ హైకోర్టు ఎత్తివేయగా, ఆపై బీసీసీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై 2017 అక్టోబర్‌లో శ్రీశాంత్‌పై నిషేధాన్ని కొనసాగించేందుకు కేరళ హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ‍్చింది. ఈ తీర్పును సవాల్‌ చేసిన శ్రీశాంత్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.

మరిన్ని వార్తలు