సూపర్‌ శ్రీకాంత్‌

22 Oct, 2017 04:03 IST|Sakshi

డెన్మార్క్‌ ఓపెన్‌ ఫైనల్లో తెలుగు తేజం

సెమీస్‌లో వోంగ్‌ వింగ్‌పై విజయం

నేడు లీ హున్‌ ఇల్‌తో టైటిల్‌ పోరు

ఈ సీజన్‌లో తన అద్వితీయ ఫామ్‌ను కొనసాగిస్తూ భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌కిడాంబి శ్రీకాంత్‌ నాలుగో సూపర్‌ సిరీస్‌ టోర్నమెంట్‌లో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ విక్టర్‌ అక్సెల్‌సన్‌ను ఓడించిన ఈ తెలుగు తేజం అదే జోరును సెమీస్‌లోనూ కనబరిచాడు. వరుస గేముల్లో తన ప్రత్యర్థి వోంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌ను చిత్తు చేసి టైటిల్‌కు విజయం దూరంలో నిలిచాడు.

నేటి ఫైనల్స్‌ రాత్రి గం. 7.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

ఒడెన్స్‌: 37 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ... ప్రతిష్టాత్మక డెన్మార్క్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత నంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో ప్రపంచ ఎనిమిదో ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 21–18, 21–17తో ప్రపంచ 15వ ర్యాంకర్‌ వోంగ్‌ వింగ్‌ కీ విన్సెంట్‌ (హాంకాంగ్‌)పై గెలుపొందాడు.

గతంలో వీరిద్దరూ నాలుగుసార్లు తలపడగా... చెరో రెండుసార్లు గెలిచారు. ఈ నాలుగు మ్యాచ్‌లు కూడా మూడు గేమ్‌లపాటు జరగడం గమనార్హం. అయితే ఈసారి శ్రీకాంత్‌ పూర్తి ఆధిపత్యం చలాయిస్తూ వరుసగా రెండు గేముల్లో విజయాన్ని ఖాయం చేసుకోవడం విశేషం. ఆదివారం జరిగే ఫైనల్లో 37 ఏళ్ల లీ హున్‌ ఇల్‌ (దక్షిణ కొరియా)తో శ్రీకాంత్‌ తలపడతాడు.

రెండో సెమీఫైనల్లో లీ హున్‌ ఇల్‌ 25–23, 18–21, 21–17తో టాప్‌ సీడ్‌ సన్‌ వాన్‌ హో (కొరియా)పై గెలిచాడు. లీ హున్‌ ఇల్, శ్రీకాంత్‌ ముఖాముఖిగా తలపడనుండటం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ టైటిల్స్‌ నెగ్గిన శ్రీకాంత్‌ సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌లో రన్నరప్‌గా నిలిచాడు.  

1980లో ప్రకాశ్‌ పదుకొనె తర్వాత ఈ మెగా టోర్నీలో పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున ఫైనల్‌కు చేరిన రెండో క్రీడాకారుడిగా శ్రీకాంత్‌ గుర్తింపు పొందాడు. 1980లో ప్రకాశ్‌ పదుకొనె ఈ టోర్నీలో విజేతగా కూడా నిలిచాడు. మహిళల సింగిల్స్‌ విభాగంలో భారత్‌ తరఫున సైనా నెహ్వాల్‌ (2012లో) టైటిల్‌ నెగ్గగా... పీవీ సింధు (2015లో) రన్నరప్‌గా నిలిచింది.  

క్వార్టర్‌ ఫైనల్లో ప్రపంచ చాంపియన్‌ అక్సెల్‌సన్‌ను ఓడించి ఆత్మవిశ్వాసంతో ఉన్న శ్రీకాంత్‌ సెమీస్‌లోనూ నిలకడగా రాణించాడు. విన్సెంట్‌ను తక్కువ అంచనా వేయకుండా ఆడుతూ తొలి గేమ్‌ ఆరంభంలో 11–6తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత విన్సెంట్‌ తేరుకునే ప్రయత్నం చేసినా శ్రీకాంత్‌ అతని ఆశలను ఆవిరి చేశాడు. రెండో గేమ్‌లోనూ దూకుడుగా ఆడిన శ్రీకాంత్‌ 4–0తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని దక్కించుకున్నాడు.  

‘చాలా గొప్పగా అనిపిస్తోంది. మంచి ప్రదర్శన చేయాలనే పట్టుదలతో ఆడాను. ఇద్దరి ఆటతీరు ఒకేలా ఉన్నప్పటికీ నేను ఓపికతో ఆడాను. ఆరంభంలో కొన్ని తప్పిదాలు చేసినా వెంటనే వాటిని సరిదిద్దుకున్నాను. ఫైనల్‌ ప్రత్యర్థి లీ హున్‌తో ఇప్పటివరకు ఆడలేదు. అతడితో మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగే అవకాశముంది’ అని శ్రీకాంత్‌ వ్యాఖ్యానించాడు.

మరిన్ని వార్తలు