-

బుమ్రా బౌలింగ్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు..

7 Jan, 2020 20:44 IST|Sakshi

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక 143 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. భారత బౌలర్లు విజృంభించి బౌలింగ్‌ చేసి లంకేయుల్ని కట్టడి చేశారు. బుమ్రా, సైనీ, శార్దూల్‌ ఠాకూర్‌లు తమ పేస్‌తో ముప్పు తిప్పలు పెట్టగా, స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు తమ మ్యాజిక్‌ను ప్రదర్శించారు. దాంతో లంకేయులు సాధారణ స్కోరుకే పరిమితమయ్యారు. లంక ఆటగాళ్లలో కుశాల్‌ పెరీరా 34 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా ముందుగా లంకేయుల్ని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దాంతో లంక బ్యాటింగ్‌ను దనుష్క గుణతిలకా- ఆవిష్క ఫెర్నాండాలో ఆరంభించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 38 పరుగులు జత చేసిన తర్వాత ఫెర్నాండో(22) పెవిలియన్‌ చేరాడు.

మరో 16 పరుగుల వ్యవధిలో గుణ తిలకా(20) కూడా పెవిలియన్‌ చేరడంతో లంక 54 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది.ఆపై పెరీరా- ఒషాడో ఫెర్నాండాలో జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. ఈ జోడి 28 పరుగులు జత చేసిన తర్వాత ఒషాడో ఫెర్నాండా(10) ఔట్‌ కాగా, అటు తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌లు ఆకట్టుకోలేదు. 33 పరుగుల వ్యవధిలో ఆరుగురు లంక ఆటగాళ్లు పెవిలియన్‌ చేరడంతో ఆ జట్టు భారీ స్కోరును చేయలేకపోయింది. చివర్లో హసరంగా(16 నాటౌట్‌; 3 ఫోర్లు) బ్యాట్‌ ఝుళిపించాడు. బుమ్రా వేసిన ఆఖరి ఓవర్‌లో హ్యట్రిక్‌ ఫోర్లు కొట్టాడు. చివరి మూడు బంతుల్ని ఫోర్లుగా మలచడంతో లంక నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్‌ ఠాకూర్‌ మూడు వికెట్లు సాధించగా, సైనీ, కుల్దీప్‌ యాదవ్‌లు తలో రెండు వికెట్లు తీశారు. వాషింగ్టన్‌ సుందర్‌, బుమ్రాలకు చెరో వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు