బెంగళూరు ఖాతా తెరుస్తుందా!

5 Apr, 2019 03:58 IST|Sakshi

సునీల్‌ గావస్కర్‌

ఐపీఎల్‌లో తొలి పది రోజులు మంచి వినోదాన్ని పంచాయి. ఎక్కువ మ్యాచ్‌లలో చివరి వరకు గానీ ఫలితం తేలకపోవడమే అందుకు కారణం. ఆరంభంలో ఉండే ఒత్తిడిని దాటి అన్ని జట్లు పాయింట్ల పట్టికలో దూసుకుపోయేందుకు ఇప్పుడు పట్టుదల ప్రదర్శిస్తున్నాయి. వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్‌ చేతిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓడిపోవడం అనూహ్యం. అయితే ఈ పరాజయాన్ని మరచి మళ్లీ వెంటనే కోలుకోగల నైపుణ్యం అత్యంత అనుభవం గల చెన్నైకి ఉంది. అయితే ఇలాంటి పట్టుదలే వారి పొరుగు జట్టు బెంగళూరుకు అవసరం ఉంది. ఐపీఎల్‌లో వారి ఆటగాళ్లు ఏమైనా ప్రభావం చూపించాలంటే ఇప్పటి వరకు జరిగింది వదిలి ముందుకు సాగాలి. ఇద్దరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌పై అతిగా ఆధారపడటమే వారిని దెబ్బ తీస్తోంది. వీరిద్దరు విఫలమైతే జట్టు మొత్తం కుప్పకూలిపోతోంది.

సమతూకమైన జట్టు కోసం వారూ ప్రయత్నిస్తున్నా ఇతర జట్లతో పోలిస్తే అది సాధ్యం కావడం లేదు. టాపార్డర్‌లో చేసిన ప్రయోగాలు ఫలితమివ్వకపోగా, భారీ స్కోరు అందించడంలో మిడిలార్డర్‌ కూడా తడబడుతోంది. కోహ్లి, డివిలియర్స్‌లాంటి ఆటగాళ్లు ఉన్న జట్టు పదే పదే తక్కువ స్కోర్లకే పరిమితమైంది. పిచ్‌ కొంత ఇబ్బందిగా ఉంటే చాలు ప్రాథ మికాంశాలు కూడా మరచిపోయి వారు బేలగా చూస్తున్నారు. చహల్‌ మినహా మరో పదునైన బౌలర్‌ ఒక్కడు కూడా లేకపోవడం ఆర్‌సీబీకి మరో పెద్ద సమస్య. దీని వల్లే ప్రత్యర్థి జట్లు భారీస్కోరుతో చెలరేగిపోతున్నాయి. కోల్‌కతా జట్టుకు కూడా లీగ్‌లో చెప్పుకోదగ్గ ఆరంభం లభించకపోయినా ఆండ్రీ రసెల్‌ రూపంలో మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చే ఆటగాడు వారితో ఉన్నాడు.

భారీ షాట్లు ఆడగల అతని నైపుణ్యం కొన్ని బంతుల వ్యవధిలో ఆటను మార్చేస్తోంది. ముంబై ఆటగాడు హార్దిక్‌ పాండ్యా తరహాలోనే రసెల్‌ కూడా భారీ సిక్సర్లు బాదుతుండగా...తర్వాతి బంతి ఎక్కడ వేయాలో ప్రత్యర్థి బౌలర్లకు అర్థం కావడం లేదు. సునీల్‌ నరైన్‌ గతంలోలాగా తన బౌలింగ్‌లో సత్తా చాటి బెంగళూరు ఖాతా తెరవకుండా నిరోధించాలని కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆశిస్తోంది. మరో వైపు టైటిల్‌ పోరులో తాము ఇంకా వెనుకబడలేదని నిరూపిస్తూ తమను అభిమానించేవారిని సంతోషపెట్టేందుకు కోహ్లి సేనకు ఇంతకంటే మంచి అవకాశం లభించదు.   

>
మరిన్ని వార్తలు