శిఖర్‌ ధావన్‌... సొంత గూటికి! 

1 Nov, 2018 02:01 IST|Sakshi

వచ్చే ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు 

ఢిల్లీ: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ఆడటం దాదాపు ఖాయమైంది. తద్వారా 11 ఏళ్ల తర్వాత అతడు సొంత నగరం తరఫున బరిలో దిగనున్నాడు. ఎనిమిదేళ్లుగా హైదరాబాద్‌కు ఆడుతున్న ఈ ఎడమ చేతివాటం బ్యాట్స్‌మన్‌ ఈ సారి ఫ్రాంచైజీ మారడానికి కారణం సన్‌ రైజర్స్‌ యాజమాన్యం తనకు చెల్లిస్తున్న ధర తక్కువని భావించడమే.   2018 సీజన్‌ వేలం సందర్భంగా ధావన్‌ను సన్‌ రైజర్స్‌ రిటైన్‌ చేసుకోలేదు. రూ.5.2 కోట్ల ధరతో వేలంలో ఆర్‌టీఎం ద్వారా సొంతం చేసుకుంది. ఇది తన స్థాయికి తగని ధరగా భావించిన ధావన్‌ అసంతృప్తితో ఉన్నాడని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సన్‌ రైజర్స్‌ అతడిని విడుదల చేసింది.

బదులుగా డేర్‌ డెవిల్స్‌ జట్టు సభ్యులైన విజయ్‌ శంకర్‌ (రూ.3.2 కోట్లు), షాబాజ్‌ నదీమ్‌ (రూ.3.2 కోట్లు), యువ ఆటగాడు అభిషేక్‌ శర్మ (రూ.55 లక్షలు)లను తీసుకుంది. ఇందులో ధావన్‌ ధర మినహా మిగిలిన మొత్తాన్ని నగదు రూపంలో డేర్‌ డెవిల్స్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ధావన్‌ తొలి ఐపీఎల్‌ (2008)లో ఢిల్లీకే ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం రెండేళ్లు ముంబై ఇండియన్స్‌కు ఆడాడు. 2011 నుంచి హైదరాబాద్‌ (2011, 12లలో దక్కన్‌ చార్జర్స్, 2013 నుంచి సన్‌రైజర్స్‌) జట్టులో భాగంగా ఉన్నాడు. 2016లో ట్రోఫీ నెగ్గడంలో కీలకంగా నిలిచాడు. సన్‌రైజర్స్‌ తరఫున 91 ఇన్నింగ్స్‌లు ఆడి 125.13 స్ట్రైక్‌ రేట్‌తో 2,768 పరుగులు చేశాడు.   

మరిన్ని వార్తలు