ఆ మాటన్నది ఇషాంతేనా!

10 Jun, 2020 01:03 IST|Sakshi

స్యామీ ‘వర్ణ’ వివక్ష వివాదం

న్యూఢిల్లీ: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడే సమయంలో తాను వర్ణ వివక్షకు గురయ్యానంటూ వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ స్యామీ చేసిన వ్యాఖ్యల వివాదం ముదిరింది. 2013–14 సీజన్లలో సన్‌రైజర్స్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు సహచర ఆటగాళ్లు తనను ‘కాలూ’ (నల్లోడు) అంటూ పిలిచారని, అప్పట్లో దాని అర్థం తనకు తెలీదన్న స్యామీ... ఇప్పుడు వారంతా తనకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాడు. పాత ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లను బట్టి చూస్తే ఈ మాటలన్నది భారత పేసర్‌ ఇషాంత్‌ శర్మ అని తెలుస్తోంది. సహచరులతో కలిసి దిగిన నాటి ఫోటోలో ఇషాంత్‌... ‘నేను, భువీ, కాలూ, గన్‌ సన్‌రైజర్‌ (స్టెయిన్‌)’ అంటూ పోస్ట్‌ చేశాడు. ‘నన్ను అప్పట్లో ఆ మాట ఎవరెవరు అన్నారో వారందరూ నాతో మాట్లాడే ప్రయత్నం చేయండి. మీలో చాలా మంది దగ్గర నా ఫోన్‌ నంబర్‌ ఉంది. ఇతర సోషల్‌ మీడియా కూడా ఉంది. మీరేం అన్నారో మీకు తెలుసు. రంగు గురించి మాట్లాడటం అంటే అది ఏ రూపంలోనైనా వివక్షగానే భావించాలి. నేను చాలా బాధపడుతున్నాను. వేర్వేరు జట్లకు ఆడిన సమయంలో డ్రెస్సింగ్‌ రూమ్‌కు సంబంధించి నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. అందరినీ నా సోదరుల్లా భావించాను. ఈ అంశంలో మీరు నాకు క్షమాపణ చెప్పడంలో తప్పు లేదు’ అని స్యామీ వ్యాఖ్యానించాడు. విండీస్‌ ఆటగాడి ఆరోపణలపై ఇషాంత్‌ గానీ, సన్‌రైజర్స్‌ యాజమాన్యం గానీ స్పందించలేదు.

మరిన్ని వార్తలు