రైజర్స్‌కు చావో.. రేవో

18 May, 2014 01:27 IST|Sakshi
రైజర్స్‌కు చావో.. రేవో

కోల్‌కతాతో నేడు కీలక మ్యాచ్
 సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్-7లో పడుతూ లేస్తూ సాగుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడి కేవలం 8 పాయింట్లు మాత్రమే సాధించిన సన్‌రైజర్స్.. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఇక దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ గెలవాలి.

ఈ నేపథ్యంలో ఆదివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగనున్న మ్యాచ్ అత్యంత కీలకంగా మారింది. సొంత వేదిక ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు ఈ సీజన్‌లో ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే ఓటమిపాలైన సంగతి తెలిసిందే. తొలిమ్యాచ్‌లో ముంబైపై బ్యాట్స్‌మెన్ వైఫల్యం కారణంగా ఓడినా.. పంజాబ్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో  205 పరుగుల భారీస్కోరు చేసి కూడా కాపాడుకోలేకపోయింది.
 
 డేల్ స్టెయిన్, భువనేశ్వర్, అమిత్ మిశ్రా, కరణ్ శర్మ వంటిబౌలర్లున్నా పంజాబ్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయలేకపోయారు. అయితే ప్రధానంగా బౌలింగ్ బలంపైనే ఆధారపడిన సన్‌రైజర్స్.. పంజాబ్‌పై ఓడినా భారీస్కోరు చేయడం జట్టుకు శుభసూచకమే. ఫించ్, వార్నర్, నమన్ ఓజాలు ఫామ్‌ను ప్రదర్శిస్తుండగా... తాజాగా కెప్టెన్ ధావన్ కూడా గాడిలో పడ్డాడు. అయితే వీరంతా సమష్టిగా రాణించడంపైనే భారీస్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి.
 
 సూపర్‌ఫామ్‌లో నైట్‌రైడర్స్
 మరోవైపు కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుస విజయాలతో ఊపుమీదుంది. లీగ్‌లో తొలుత అనూహ్య పరాజయాలతో వెనకబడినా.. ఆపై తేరుకొని మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. ఈ సీజన్‌లో తిరుగులేని విజయాలు సాధిస్తున్న పంజాబ్‌ను ఓడించడంతో పాటు ఆ తర్వాత వరుసగా మరో రెండు మ్యాచ్‌లు గెలవడంతో... రెట్టించిన ఆత్మవిశ్వాసంతో హైదరాబాద్‌తో మ్యాచ్‌కు సిద్ధమైంది.
 
  సన్‌రైజర్స్‌తో పోలిస్తే.. 10 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో ఉన్న కోల్‌కతా ప్లే ఆఫ్‌కు చేరువగా ఉంది. కెప్టెన్ గంభీర్, ఉతప్పలు అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతోపాటు నాణ్యమైన విదేశీ, దేశవాళీ బ్యాట్స్‌మెన్ ఆ జట్టులో ఉన్నారు. బౌలింగ్‌లోనూ కలిస్, మోర్కెల్, వినయ్‌కుమార్, చావ్లా వంటి వారితో పటిష్టంగా కనిపిస్తోంది. దీంతో కోల్‌కతా జైత్రయాత్రకు హైదరాబాద్ ఏ మేరకు బ్రేక్ వేయగలుగుతుందనేది ఆసక్తికరం.
 

>
మరిన్ని వార్తలు