టై అంటే టై.. సూపర్‌ ఓవర్‌ ఏమిటి?

26 Jun, 2020 14:50 IST|Sakshi

వెల్లింగ్టన్‌: గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ను విజయం వరించినట్లే వరించి చేజారిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ఫైనల్లో మ్యాచ్‌ రెండు సార్లు సూపర్‌ ఓవర్‌కు దారి తీయడంతో చివరకు బౌండరీ కౌంట్‌ విధానం అనుసరించాల్సి వచ్చింది. దాంతో ఇంగ్లండ్‌ను విజయం వరించగా, న్యూజిలాండ్‌ను పరాజయం వెక్కిరించింది. దాంతో వన్డే వరల్డ్‌కప్‌ సాధించాలనుకున్న కివీస్‌ ఆశలు నెరవేరలేదు. వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు చేరినా కివీస్‌కు కప్‌కు దక్కకపోవడం ఇక్కడ గమనార్హం. కాగా, తమ జట్టును ‘సూపర్‌ ఓవర్‌’ దెబ్బ తీసిన బాధ ఆ జట్టు వెటరన్‌ ఆటగాడు రాస్‌ టేలర్‌ మనసులో అలానే ఉండిపోయింది. ఇదొక అనవసరపు విధానమని తాజాగా టేలర్‌ పేర్కొన్నాడు. ('కోపం వచ్చింది.. కానీ ఏం చేయలేకపోయా')

‘వన్డే ఫార్మాట్‌లో సూపర్‌ ఓవర్‌ అవసరం లేదనేది నా అభిప్రాయం. ఇక 50 ఓవర్ల వరల్డ్‌కప్‌లో కూడా ఈ విధానంతో ఉపయోగం లేదు. వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ టై అయితే కప్‌ను ఇరు జట్లకు పంచాలి. సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. అంతేగానీ సూపర్‌ ఓవర్‌తో ఒక్క జట్టును ఫేవరెట్‌ చేయడం భావ్యం కాదు. దీనిపై నేను ఇంకా గందరగోళంలో ఉన్నాను. నేను చాలాకాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నా. వన్డే టైగా ముగిస్తే ఎలాంటా సమస్యా లేదు. ఫుట్‌బాల్‌, లేదా ఇతర క్రీడలు కానీ, టీ20లు కానీ టై అయితే మ్యాచ్‌ను కొనసాగించడం సరైనది. దాంతో విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ వన్డే మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ అవసరం అని నేను అనుకోను. తుది పోరు  టై అయితే సంయుక్త విజేతగా ప్రకటించాలి. సూపర్‌ ఓవర్‌ అనేది అ‍ప్పటికప్పుడు తీసుకొచ్చిన నిబంధనలా అనిపించింది. అది వరల్డ్‌కప్‌లో ఉందనే విషయం నాకు తెలియదు. మ్యాచ్‌ టై అంటే టై.. అంతే కానీ సూపర్‌ ఓవర్‌ ఏమిటి?. కప్‌ విషయంలో సూపర్‌ ఓవర్‌ అనేది మంచి ఆలోచన కాదు’ అని ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ ఇన్‌ఫోతో మాట్లాడిన టేలర్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు