అనురాగ్ ఠాకూర్ భవితవ్యం తేలేది రేపే?

1 Jan, 2017 11:48 IST|Sakshi
అనురాగ్ ఠాకూర్ భవితవ్యం తేలేది రేపే?

న్యూఢిల్లీ: లోధా కమిటీ సిఫారుసుల అమలులో భాగంగా భారత క్రికెట్ కంట్రలో బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసును ఇప్పటికే పలుమార్లు వాయిదా వేసిన సుప్రీం.. రేపు తీర్పును వెల్లడించే అవకాశాలు కనబడుతున్నాయి. లోధా కమిటీ సిఫారుసులను అడ్డుకునేందుకు అనురాగ్ ఠాకూర్ అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించారంటూ అతనిపై పిటిషన్ దాఖలైంది. 

 

బీసీసీఐలో ‘కాగ్‌’ అధికారి నియామకం ప్రభుత్వ జోక్యం కిందికి వస్తుందని తెలుపుతూ లేఖ రాయాలని ఐసీసీ సీఈవో డేవ్‌ రిచర్డ్‌సన్‌ను ఠాకూర్‌ కోరినట్లు కోర్టు దృష్టికి వచ్చింది. అయితే అనురాగ్ దాఖలు చేసిన అఫిడవిట్లో మాత్రం ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. దాంతో  డిసెంబర్ 15వ తేదీన విచారణలో అనురాగ్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.  ఒకవేళ అనురాగ్ చెప్పేది అసత్య ప్రమాణం అని తేలితే జైలు కెళ్లాల్సి వస్తుందంటూ సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.  కోర్టును మభ్యపెట్టేలా పదేపదే ప్రవర్తిస్తున్నందుకు విచారణకు ఆదేశిస్తే జైలుకెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించింది. 'ప్రతీ దశలోనూ విచారణకు ఆటంకాలు సృష్టిస్తున్నావు. 70 ఏళ్ల తర్వాత కూడా అందరూ పదవులను అనుభవిద్దామని అనుకుంటున్నారు. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం అయిపోయింది. అందుకే అంతా ఇంతలా ఎగబడుతున్నారు'అని సుప్రీం కోర్టు ఆనాటి విచారణలో మండిపడింది.  ఈ కేసును సుప్రీంకోర్టు రేపు విచారించే అవకాశం ఉంది. ఒకవేళ రేపు కేసును పూర్తిస్థాయిలో విచారించిన పక్షంలో ఎల్లుండి తీర్పును వెలువరించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ కేసులో తీర్పు బీసీసీఐకి వ్యతిరేకంగా వస్తే మాత్రం ప్రస్తుత బోర్డు పరిస్థితి, అందులోని సభ్యుల పరిస్థితి డైలమాలో పడటం ఖాయంగా కనబడుతోంది.
 

మరిన్ని వార్తలు