‘పాక్‌కు భయపడే కోహ్లి పారిపోయాడు’

21 Sep, 2018 18:16 IST|Sakshi
కోహ్లి, గంభీర్‌

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌ వివాదస్పద వ్యాఖ్యలు

ఘాటుగా బదులిచ్చిన గౌతం గంభీర్‌

ముంబై: భవిష్యత్తు టోర్నీల దృష్ట్యా దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఆసియాకప్‌కు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి బీసీసీఐ విశ్రాంతిని కల్పించిన విషయం తెలిసిందే. కానీ పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ తన్వీర్‌ అహ్మద్‌ మాత్రం ఆసియాకప్‌లో పాక్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని భయపడే కోహ్లి పారిపోయాడని ఘాటుగా విమర్శించాడు. ఈ వ్యాఖ్యలను భారత సీనియర్‌ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ తనదైన శైలిలో తిప్పికొట్టాడు. గత బుధవారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. 

ఈ మ్యాచ్‌ సందర్భంగా  ఓ ఛానెల్‌ చర్చకార్యాక్రమంలో గంభీర్‌, తన్వీర్‌ అహ్మద్‌లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ చర్చలో భాగంగా తన్వీర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. ‘విరాట్‌ కోహ్లి భయపడే ఆసియాకప్‌కు దూరమయ్యాడని నాకు అనిపిస్తోంది. ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా అతను లిమిటెడ్‌ ఓవర్ ఫార్మాట్‌లోనే వెన్ను నొప్పితో బాధపడ్డాడు. ఆ నొప్పితోనే తన ఆటను కొనసాగించాడు. అదే నొప్పితో టెస్ట్‌ సిరీస్‌లో సైతం రాణించాడు. ఈ లెక్కన అతని గాయం అంత పెద్దది కాదనిపిస్తోంది. ఆసియాకప్‌ కూడా ఆడటం అతనికేం అంత కష్టం కాదు. కానీ ఈ టోర్నీలో భారత్‌ పాకిస్తాన్‌తో రెండు మూడు సార్లు తలపడనుందన్న విషయం కోహ్లిని కలవరపెట్టింది. దీంతో అతను ఈ టోర్నీలో పాల్గొనకుండా పారిపోయాడు’ అని చెప్పుకొచ్చాడు.

ఈ వ్యాఖ్యలపై గంభీర్‌ వెంటనే స్పందిస్తూ.. ‘విరాట్‌ కోహ్లి ఇప్పటికే 35 నుంచి 36 సెంచరీలు చేశాడు. కోహ్లి గురించి మాట్లాడుతున్న ఈ పెద్దమనిషి(తన్వీర్‌) కోహ్లి సెంచరీలు చేసినన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లు కూడా ఆడలేదు’ అంటూ ఘాటుగా బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ డిస్కషన్‌ హాట్‌ టాపిక్‌ అయింది. కోహ్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తన్వీర్‌పై కోహ్లి, భారత అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లండ్‌ పర్యటనలో రాణించిన కోహ్లి వెన్నునొప్పితో బాధపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భవిష్యత్తు వెస్టిండీస్‌, ఆస్ట్రేలియా పర్యటనలను దృష్టిలోపెట్టుకుని టీం మేనేజ్‌మెంట్‌ అతనికి ఆసియాకప్‌ నుంచి మినహాయింపునిచ్చింది.

మరిన్ని వార్తలు