రూ.300 కోట్లు

9 Apr, 2015 02:13 IST|Sakshi

ఈ ఏడాది ఐపీఎల్ జట్లకు లభిస్తున్న స్పాన్సర్‌షిప్ మొత్తం
గత ఏడాదితో పోలిస్తే రూ. 50 కోట్ల పెరుగుదల
 

ముంబై : దేశంలో ఈ 45 రోజులు అభిమానుల్లో ఉండే క్రేజ్‌ను సొమ్ము చేసుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు కూడా సిద్ధమయ్యాయి. ఈ ఏడాది 8 ఐపీఎల్ జట్లకు కలిపి లోగో స్పాన్సర్‌షిప్ కోసం రూ.300 కోట్లు వెచ్చించబోతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.50 కోట్లు ఎక్కువ. ఐపీఎల్‌కు క్రేజ్ పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం.
ఐపీఎల్‌లో స్టార్ జట్లు చెన్నై, ముంబై, కోల్‌కతాలకు మిగిలిన జట్లతో పోలిస్తే డిమాండ్ ఎక్కువగా ఉంది.
ఇన్నాళ్లూ కోల్‌కతాకు స్పాన్సర్‌గా వ్యవహరించిన నోకియా స్థానంలో జియోని ఫోన్ ఈ ఏడాది స్పాన్సర్‌షిప్ ఒప్పందం కుదుర్చుకుంది. కేకేఆర్ క్రికెటర్ల దుస్తుల ముందు భాగంలో తమ పేరు ముద్రించినందుకు గాను ఏడాదికి 15 నుంచి 18 కోట్లు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఆ సంస్థ మూడేళ్ల ఒప్పందం చేసుకుంది.
ఐపీఎల్‌లో అందరికంటే ఎక్కువ డిమాండ్ ఉన్న జట్టు చెన్నై. ఈ జట్టుకు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ఎయిర్‌సెల్ సంస్థ ఏడాదికి రూ.22 కోట్లు చెల్లిస్తోందని సమాచారం.
వీడియోకాన్ డీ2హెచ్ సంస్థ ముంబై ఇండియన్స్‌కు ఏడాదికి 15 నుంచి 16 కోట్ల రూపాయలు చెల్లిస్తోందని అంచనా.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రధాన స్పాన్సర్‌గా హువాయి ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్లు చెల్లిస్తుండగా... రాజస్థాన్ రాయల్స్‌కు ప్రధాన స్పాన్సర్ అల్ట్రాటెక్  రూ. 9 కోట్లదాకా వెచ్చిస్తోందని సమాచారం.
ఏటా సుమారు 20 కోట్ల మంది ఐపీఎల్‌ను ప్రత్యక్షంగా, టీవీల ద్వారా చూస్తున్నారని అంచనా. 2013లో టీవీ రేటింగ్ 3.2 కాగా... గత ఏడాది అది 3.6కు పెరిగింది. ఈ ఏడాది ఇది మరింత పెరగొచ్చని అంచనా. దీంతో కార్పొరేట్లు భారీ మొత్తాలు వెచ్చించేందుకు వెనకాడటం లేదు.
ఈసారి యూనివర్సిటీలు కూడా స్పాన్సర్‌షిప్ కోసం ముందుకు వస్తున్నాయి. తమిళనాడులోని ఒక యూనివ ర్సిటీ రాజస్థాన్ జట్టుకు కో స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు వచ్చింది. ఇతర రాష్ట్రాల్లోనూ తమ బ్రాండ్ ప్రచారానికి సరైన వేదిక అని ఈ సంస్థలు భావిస్తున్నాయి.
గత ఏడాది టైటిల్ గెలవడంతో తమ ఫ్యాన్ బేస్ పెరిగిందని, అందుకే తమ రేట్లు 15 శాతం పెంచామని కోల్‌కతా జట్టు సీఈఓ వెంకీ మైసూర్ తెలిపారు.
మూడేళ్ల క్రితం వరకు బెంగళూరు జట్టు తమ సొంత బ్రాండ్ (యూబీ గ్రూప్)ను ప్రమోట్ చేసుకునేది. కానీ ఇప్పుడు బయటి సంస్థల నుంచి స్పాన్సర్‌షిప్ తీసుకుంటోంది.
ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్‌లకు బాగా డిమాండ్ ఉండేది. ఐపీఎల్‌లో ప్రతి రోజు ఏ రెండు జట్ల మధ్య మ్యాచ్‌లు జరిగినా అందులో భారత క్రికెటర్లు ఉంటారు. అదే సమయంలో రాత్రి 8 గంటల నుంచి మ్యాచ్‌లు  ప్రైమ్‌టైమ్‌లో  ప్రసారమవుతాయి. కాబట్టి ఐపీఎల్‌ను ప్రచారానికి సరైన వేదికగా కంపెనీలు భావిస్తున్నాయి.
 
పంజాబ్‌కు 20 కంపెనీలు
 
న్యూఢిల్లీ: గత ఏడాది ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శనతో చెలరేగి ఫైనల్ చేరిన పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌కు ఈ సారి ప్రకటనల పంట పండింది. ఐపీఎల్-8లో ఆ జట్టుకు స్పాన్సర్‌గా ఏకంగా 20 సం స్థలు ఉండటం విశేషం. 2014లో అధికారిక టైటిల్ స్పాన్సర్‌గా ఉన్న టాటా మోటార్స్ ప్రైమా ఈ సారి కూడా దానిని కొనసాగించింది. హెచ్‌టీసీ, మ్యాన్‌ఫోర్స్, ఏసీసీ, రాయల్‌స్టాగ్, పాన్ పరాగ్, డీసీబీ బ్యాంక్‌లు కూడా ప్రధాన స్పాన్సర్లుగా ఉన్నాయి. ఇవి కాకుండా మరో 13 కంపెనీలు కింగ్స్ ఎలెవన్‌కు సహాయ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నాయి. గత సంవత్సరం ప్రదర్శన ఒక్కసారిగా ఆ జట్టు విలువను పెంచడం విశేషం.
 
టీమ్ కిట్స్ మీద ప్రచారానికి ఏ జట్లకు ఎంత (అన్ని అంకెలు కోట్ల రూపాయల్లో)
     షర్ట్ ముందు            వెనక    చేతిమీద    క్యాప్‌మీద    ఛాతిమీద
 చెన్నై, ముంబై, కోల్‌కతా    15-22    7-10    3-3.5    2-2.5    6-8
 ఇతర ఐపీఎల్ జట్లు             8-12    3-4    2.5-3    1.5-2    3-5

మరిన్ని వార్తలు