74 బంతుల్లో 140 పరుగులు

6 Jan, 2019 02:49 IST|Sakshi

8 ఫోర్లు, 13 సిక్సర్లతో తిసారా పెరీరా మెరుపు సెంచరీ

అయినా శ్రీలంక ఓటమి  

మౌంట్‌ మాంగనీ: తొలి వన్డేలో ఐదు... రెండో వన్డేలో మరో ఐదు... తన బౌలింగ్‌లో తిసారా పెరీరా ఇచ్చిన సిక్సర్లు ఇవి! ఆ కసినంతా అతను రెండో వన్డేలో తన బ్యాటింగ్‌లో చూపించాడు. పదికి తోడు అదనంగా మరో మూడు సిక్సర్లు బాది వీర విధ్వంసం సృష్టించాడు. 74 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 140 పరుగులు చేసినా సరే శ్రీలంకను పరాజయం నుంచి తప్పించలేకపోయాడు. శనివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 21 పరుగుల తేడాతో లంకను ఓడించింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో గెలుచుకుంది. ముందుగా కివీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. రాస్‌ టేలర్‌ (105 బంతుల్లో 90; 4 ఫోర్లు, 1 సిక్స్‌), మున్రో (77 బంతుల్లో 87; 12 ఫోర్లు, 2 సిక్సర్లు), నీషామ్‌ (37 బంతుల్లో 64; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు.

అనంతరం లంక 46.2 ఓవర్లలో 298 పరుగులకు ఆలౌటైంది. తిసారా జోరుకు తోడు గుణతిలక (71; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీ సాధించాడు.  ఒక దశలో 16 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక స్కోరు 27 ఓవర్లు ముగిసేసరికి 128/7గా నిలిచింది. అయితే ఆ తర్వాత 19.2 ఓవర్ల పాటు ప్రతీ బౌలర్‌పై విరుచుకుపడుతూ పెరీరా జోరు కొనసాగింది. ఈ క్రమంలో 28 బంతుల్లో హాఫ్‌ సెంచరీ, 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా సౌతీ ఓవర్లో అతను 4 భారీ సిక్సర్లతో చెలరేగడం ఇన్నింగ్స్‌కు హైలైట్‌గా నిలిచింది. చివరి మూడు వికెట్లకు 75, 51, 44 పరుగులు భాగస్వామ్యాలు నెలకొల్పిన తిసారా జట్టును గెలిపించలేకపోయాడు. 23 బంతుల్లో 22 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్‌కు ప్రయత్నించి తిసారా లాంగాన్‌లో బౌల్ట్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో లంక ఓటమి ఖాయమైంది. 

మరిన్ని వార్తలు