ఐపీఎల్ వేలంలో ప్చ్... స్పందించిన ప్లేయర్

5 Apr, 2018 18:29 IST|Sakshi
క్రికెటర్ తైమల్ మిల్స్ (ఫైల్ ఫొటో)

భయపడితే ఐపీఎల్ వేలానికి దూరంగా ఉండాలి!

సాక్షి, స్పోర్ట్స్‌ : గతేడాది భారీ ధర పలికి.. ఈ ఐపీఎల్ సీజన్లో కనీసం ఏ జట్టు కూడా అతడిని కొనుగోలు చేయకుండా ఆ క్రికెటర్‌కు షాకిచ్చాయి. గతేడాది ఐపీఎల్‌లో 12 కోట్లు ధర పలికి, ప్రస్తుత వేలంలో అనామకుడిగా మిగిలిన ఆ క్రికెటర్ మరెవరో కాదు తైమల్ మిల్స్. ఐపీఎల్ 11 సీజన్లో తాను ఆడకపోవడంపై మిల్స్ స్పందించాడు. ఏ ఆటగాడికైనా ఇలాంటి ఘటన ఎదురుకావడం కష్టంగానే ఉంటుంది. కానీ ఎవరో మనల్ని ఎంపిక చేయలేదనో, నమ్మలేదనో భయాల్ని పెంచుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. తమను కొనుగోలు చేస్తారా లేదా అన్న భయం ఉంటే మాత్రం ఆ ఆటగాళ్లు వేలానికి దూరంగా ఉండటమే ఉత్తమమని అభిప్రాయపడ్డాడు. 

'గతేడాది భారీ ధరకు నన్ను తీసుకున్నందుకు చాలా సంతోష పడ్డాను. ఈ సీజన్లో తీసుకోలేదని ఏ జట్టుపై నాకు కోపం లేదు. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. ఈ ఏడాది వేలంలో నన్ను ఏ జట్టు ఎంపిక చేయనుందున పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్‌ (పీఎస్‌ఎల్) లో కరాచీ కింగ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాను. పెషావర్ జల్మీతో జరిగిన సెమీ ఫైనల్లో దురదృష్టవశాత్తూ మా కరాచీ కింగ్స్ ఓడిపోయింది. కానీ పాక్‌లో సెక్యూరిటీ చాలా బాగుంది. ఆసియాలో ఎక్కడ మ్యాచ్‌లు జరిగినా క్రికెట్ ప్రేమికులతో స్టేడియాలు నిండిపోతాయని' మిల్స్ వివరించాడు. గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు భారీ ధరలకు మిల్స్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

నాణేనికి రెండు వైపులా ఉన్నట్లు జీవితంలో కష్టసుఖాలు ఉంటాయని, ప్రస్తుతం దేశవాలీ లీగ్స్, జాతీయ జట్టుకు ఆడుతూ ఆటను మెరుగు పరుచుకోవడంపైనే దృష్టిసారించినట్లు మిల్స్ తెలిపాడు. తనను ఎంతగానో ఆధరించిన ససెక్స్ జట్టుకు మళ్లీ ఆడతానని పేర్కొన్నాడు. గతేడాది విఫలమైన సందర్భంలో భారీ ధరకు తీసుకున్నారని, కానీ ఈ ఏడాది అద్భుతంగా రాణించినా ఏ ఫ్రాంచైజీ తనను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదన్నాడు.

'మా దేశ ప్రస్తుత ట్వంటీ20 స్పెషలిస్టు ఇక ధనిక క్రికెటర్ అయిపోయాడు. ఐపీఎల్లో మిల్స్ కు రూ.12 కోట్లు ధర పలకడం టెస్టు క్రికెట్ కు కచ్చితంగా చెంపపెట్టే. టెస్టు క్రికెట్ ఎంత అథమ స్థాయిలో ఉందో ఐపీఎల్ వేలాన్ని బట్టి అర్ధమవుతోందని' గతేడాది ఐపీఎల్ 10వ సీజన్ వేలం అనంతరం స్టార్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు