రెండు వైపుల నుంచి ఒకరే అంపైరింగ్‌! 

11 Mar, 2020 01:16 IST|Sakshi

రంజీ ఫైనల్లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో సి.షంషుద్దీన్‌కు దెబ్బ తగిలింది. వికెట్‌ తీసిన ఆనందంలో బెంగాల్‌ ఫీల్డర్‌ ఒకరు బంతిని విసరగా దీనిని గమనించని షంషుద్దీన్‌ పొత్తి కడుపునకు బలంగా తగిలింది. దాంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న అంపైర్‌ను సౌరాష్ట్ర క్రికెట్‌ సంఘం అధికారులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఒక సెషన్‌ పాటు మరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌ కేఎన్‌ అనంతపద్మనాభన్‌ ప్రతీ ఓవర్‌కు మారుతూ రెండు ఎండ్‌ల నుంచి అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వర్తించారు. స్థానిక అంపైర్‌ పీయూష్‌ కక్కడ్‌ స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌గా నిలబడిపోయారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం ఈ మ్యాచ్‌కు తటస్థ అంపైర్లు ఉండాలి. పీయూష్‌ సౌరాష్ట్రకు చెందినవాడు కావడంతో మెయిన్‌ ఎండ్‌ నుంచి అంపైరింగ్‌ చేయనివ్వలేదు. థర్డ్‌ అంపైర్‌ రవికి మాత్రమే డీఆర్‌ఎస్‌ విధానంపై అవగాహన ఉండటంతో ఆయనా మైదానంలోకి రాలేదు. చివరకు షంషుద్దీన్‌ను టీవీ అంపైర్‌ స్థానంలో కూర్చోబెట్టి రవి ఆ తర్వాత అంపైరింగ్‌ బాధ్యతలు నిర్వహించారు. రంజీ ఫైనల్‌ నిర్వహణలో ఈ తరహా బీసీసీఐ వైఫల్యంపై విమర్శలు వచ్చాయి. ముంబై నుంచి రానున్న యశ్వంత్‌ బర్డే నేటినుంచి ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా