రిలే ‘పసిడి’ రేసులో బోల్ట్‌

13 Aug, 2017 01:57 IST|Sakshi
రిలే ‘పసిడి’ రేసులో బోల్ట్‌

4X100 మీటర్ల రిలే ఫైనల్లో జమైకా బృందం
లండన్‌: తన అంతర్జాతీయ కెరీర్‌ను పసిడి పతకంతో ముగించాలని ఆశిస్తున్న జమైకా దిగ్గజ అథ్లెట్‌ ఉసేన్‌ బోల్ట్‌ ఆ దిశగా చివరి అడుగు వేశాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 4గీ100 మీటర్ల రిలే ఈవెంట్‌లో టికెండో ట్రేసీ, జూలియన్‌ ఫోర్టీ, మైకేల్‌ క్యాంప్‌బెల్, ఉసేన్‌ బోల్ట్‌లతో కూడిన జమైకా బృందం ఫైనల్‌కు చేరింది.

శనివారం జరిగిన హీట్స్‌లో... రెండో హీట్‌లో బరిలోకి దిగిన జమైకా జట్టు 37.95 సెకన్లలో గమ్యానికి చేరి అగ్రస్థానం పొంది ఫైనల్‌ బెర్త్‌ దక్కించుకుంది. ఈ హీట్‌ నుంచి ఫ్రాన్స్, చైనా, కెనడా జట్లు కూడా ఫైనల్‌కు చేరాయి. అంతకుముందు తొలి హీట్‌లో మైక్‌ రోడ్జర్స్, జస్టిన్‌ గాట్లిన్, బీజే లీ, క్రిస్టియన్‌ కోల్మన్‌లతో కూడిన అమెరికా జట్టు 37.70 సెకన్లలో రేసును ముగించి ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ హీట్‌ నుంచి బ్రిటన్, జపాన్, టర్కీ రిలే జట్లు కూడా ఫైనల్లోకి అడుగు పెట్టాయి.

మహిళల రిలే జట్టుపై అనర్హత వేటు...
మరోవైపు 4గీ400 మీటర్ల రిలేలో భారత పురుషుల, మహిళల జట్లు నిరాశాజనక ప్రదర్శనతో హీట్స్‌లోనే వెనుదిరిగాయి. జిస్నా మాథ్యూ, పూవమ్మ, అనిల్డా థామస్, నిర్మలా షెరోన్‌లతో కూడిన భారత మహిళల రిలే జట్టు 3 నిమిషాల 28.62 సెకన్లలో రేసును ముగించి తమ హీట్స్‌లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే తొలి ల్యాప్‌లో జిస్నా 250 మీటర్ల దూరం తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వేరే లైన్‌లో పరుగెత్తినట్లు తేలడంతో నిర్వాహకులు భారత రిలే జట్టు ఫలితాన్ని రద్దు చేయడంతోపాటు అనర్హత వేటు వేశారు. కున్హు మొహమ్మద్, అమోజ్‌ జాకబ్, మొహమ్మద్‌ అనస్, రాజీవ్‌ అరోకియాలతో కూడిన భారత పురుషుల రిలే జట్టు 3 నిమిషాల 2.80 సెకన్లలో గమ్యానికి చేరి తమ హీట్స్‌లో ఐదో స్థానంలో, ఓవరాల్‌గా పదో స్థానంలో నిలిచింది.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు