విరాట్‌ ముంగిట మరో భారీ రికార్డు

21 Jun, 2019 16:37 IST|Sakshi

సౌతాంప్టన్‌: వరుస రికార్డులతో దూసుకుపోతూ పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డుపై కన్నేశాడు. ప్రస్తుతం విరాట్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగవంతంగా 20 వేల పరుగుల మార్కును అందుకునేందుకు కోహ్లి స్వల్ప దూరంలో నిలిచాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా శనివారం అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌ జరుగనున్న నేపథ్యంలో కోహ్లి ఆ రికార్డును అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లి చేసిన పరుగులు 19, 896. రేపటి మ్యాచ్‌లో కోహ్లి 104 పరుగులు సాధిస్తే 20 వేల పరుగుల మైలురాయిని చేరతాడు.
(ఇక్కడ చదవండి:రికార్డులు ‘కింగ్‌’ కోహ్లి)

అదే సమయంలో వేగవంతంగా ఆ మార్కును చేరిన జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్న సచిన్‌ టెండూల్కర్‌, బ్రియాన్‌ లారా(వెస్టిండీస్‌)ల రికార్డును బ్రేక్‌ చేస్తాడు.  సచిన్‌, లారాలు 453 ఇన్నింగ్స్‌లు ఆ ఫీట్‌ను నమోదు చేసి టాప్‌ ప్లేస్‌లో కొనసాగుతున్నారు. కాగా, కోహ్లి ఇప్పటివరకూ ఆడిన అంతర్జాతీయ ఇన్నింగ్స్‌లు(టెస్టులు, వన్డేలు, టీ20లు) 415. దాంతో వరల్డ్‌కప్‌లోనే ఆ రికార్డును కోహ్లి బ్రేక్‌ చేసే అవకాశం ఉంది. అందులోనూ తాజా వరల్డ్‌కప్‌లో ఎటువంటి ప్రభావం చూపలేకపోతున్న అఫ్గానిస్తాన్‌పైనే ఆ రికార్డును కోహ్లి సాధించాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 77 వ్యక్తిగత పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వన్డే ఫార్మాట్‌లో వేగవంతంగా 11వేల పరుగుల మార్కును చేరిన రికార్డును కోహ్లి నెలకొల్పాడు.


 

మరిన్ని వార్తలు